ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం

ఢిల్లీ పేలుడు కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. బాంబ్ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడులో కీలక సుత్రదారి అయిన డాక్టర్ షాహీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఫరీదాబాద్‌లో మరోసారి భారీగా పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి.
లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్న షాహీన్ ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి..
ఫరీదాబాద్‌లో కశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అద్దెకు ఉంటున్న రెండు గదుల్లో పోలీసులు 2వేల 900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా డాక్టర్ షాహీన్ పేరు బయటపడింది. షాహీన్ అల్-ఫలా యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రోఫెసర్‌గా పనిచేస్తోందని, ముజమ్మిల్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు. ముజమ్మిల్ ఇచ్చిన సమాచారంతో షాహీన్‌కు చెందిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఒక ఏకే-47 రైఫిల్‌ను కూడా గుర్తించినట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి హర్యానా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. అల్-ఫలా యూనివర్సిటీ క్యాంపస్‌లో విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయని, ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉన్న పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, విద్యార్థులు, సిబ్బంది సహా 52 మందిని విచారించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.



