ఆలయ పునరుద్ధరణ పనుల్లో పురాతన బంగారు నాణేలు లభ్యం

Tamil Nadu: భారత దేశం ఎన్నో నిధి నిక్షేపాల గడ్డ. ఎక్కడ ఏ నిధులు దాగి ఉన్నాయో ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటిది తమిళనాడులో వేల సంవత్సరాల నాటి చరిత్ర… బంగారు కాంతులతో వెలుగులీనింది. ఓ పురాతన ఆలయం తన గర్భంలో దాచుకున్న అపురూప రహస్యం ఇప్పుడు బయటపడింది. అవి కేవలం నాణేలు కావు… చరిత్ర పటాన్ని మార్చిన ఓ సామ్రాజ్య సజీవ సాక్ష్యాలు. మరి ఇన్నాళ్లు కాలం దాచిన ఈ స్వర్ణ గని వెనుక ఉన్న రాజులెవరు..? పురావస్తు శాఖ అధ్యయనంలో ఏం తేలింది..?
వేల సంవత్సరాల నాటి చరిత్ర బంగారు కాంతులతో కళ్ల ముందు నిలిచింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా, జవ్వాదుమలై కొండల్లోని ఒక శిథిలమైన పురాతన శివాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా బంగారు నాణేలు బయటపడ్డాయి. శివాలయంలో ఏకంగా 103 బంగారు నాణేలు బయటపడ్డాయి. జవ్వాదు కొండల సమీపంలోని కోవిలూర్ గ్రామంలో ఉన్న చారిత్రాత్మక శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఆలయంలోని గర్భగుడికి పునరుద్ధరణ పనులు చేపడుతుండగా కార్మికులు తవ్వకాలు జరిపారు.
ఈ క్రమంలో వారికి ఓ పాత మట్టి కుండ లభించింది. దాన్ని జాగ్రత్తగా తెరిచి చూడగా, అందులో పురాతన కాలం నాటి బంగారు నాణేలు ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు, పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పురావస్తు శాఖాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం 2.49 కోట్లు కేటాయించింది.
ఇవి కేవలం నాణేలు కావు.. దక్షిణ భారతదేశ చోళ సామ్రాజ్య చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమని చెబుతున్నారు. ఈ ఆలయం చాలా శతాబ్దాల నాటిదని, చోళ రాజు మూడో రాజరాజ చోళుని కాలంలో అంటే 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి కూడా ఆ కాలానికి చెందిన లక్షణాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారు నాణేలు చివరి చోళుల కాలానికి లేదా తొలి పాండ్యుల కాలానికి చెందినవి కావొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజుల్లో ఆలయాలకు విరాళాలుగా, వాణిజ్య కార్యకలాపాల్లో బంగారు నాణేలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగానే ఈ నిధి బయటపడటంతో దీనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ నాణేలను పురావస్తు శాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు. వాటిపై ఉన్న ముద్రలు, లోహ మిశ్రమం, తయారీ విధానం ఆధారంగా వాటి కాలాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను నిర్ధారించనున్నారు. ఈ అరుదైన నిధి బయటపడటంతో స్థానికులు, చరిత్ర ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమిళనాడు ఆలయాల గొప్ప వారసత్వానికి, చోళుల వైభవానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. జవ్వాదుమలై కొండల్లో వెలికితీసిన ఈ నాణేలు ఆనాటి వాణిజ్య సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఆలయాల నిర్వహణ గురించి కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయని పురావస్తు నిపుణులు విశ్వసిస్తున్నారు. పురావస్తు శాఖ ప్రస్తుతం ఈ నాణేల ముద్రణా విధానం, చిహ్నాలు, లిపి, ఆ నాణెంపై ఉన్న బొమ్మలపై లోతైన విశ్లేషణలు చేపట్టింది. ఈ పరిశోధనలతో ఈ నాణేలు ఏ రాజు కాలం నాటివి, వాటి వయసు ఎంతో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
కాగా దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజవంశాల్లో చోళులు ముఖ్యులు. వారి కాలంలో కళ, దేవాలయ వాస్తు, ఆర్థిక వ్యవస్థలు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాయి. యుద్ధాల సమయంలో సంపద ఆక్రమణకు గురి కాకుండా భద్రత కోసం ఈ ఆలయంలో దాచి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామానికి ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందని ఊహించలేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు తమ ఆదీనంలోకి తీసుకొని.. పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఆలయ పరిసరాల్లోనే కాక, సమీప గ్రామాల్లో కూడా తమ పరిశోధనలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు గతంలోనూ తమిళనాడులో ఇలాంటి పురాతన నాణేలు లభ్యం అయ్యాయి. తమిళనాడులోని తిరువనైకోవిల్లోని జంబుకేశ్వరర్ ఆలయం తవ్వుతున్నప్పుడు మూసివున్న పాత్రలో 1.716 కిలోల బరువున్న 505 బంగారు నాణేలు కనిపించాయి. ఈ నాణేలు అఖిలాండేశ్వరి మందిరం సమీపంలోని కార్మికులు చూసిన సీలు వేసిన కుండలో ఉన్నాయి. ఆలయ అధికారులు దానిని తెరిచినప్పుడు 505 బంగారు నాణేలు కనిపించాయి. ఈ నాణేల ఎప్పటివో, ఈ నాణెల చరిత్రను అర్థం చేసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా వాటిని పరిశీలించాల్సి ఉంది. నివేదికల ప్రకారం ఈ కుండ దాదాపు 7 అడుగుల లోతులో కనుగొనబడింది.
1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో ఆవర్తన పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోందని వర్గాలు తెలిపాయి. అంబాల్ సన్నిధికి ఎదురుగా ఉన్న వాలై కొట్టం నుండి మొక్కలను తొలగించి నందవనంను అభివృద్ధి చేయాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. బంగారు నాణేలతో కూడిన ఇత్తడి కుండను ఆసక్తికరమైన కార్మికులు బయటకు తీసి మూత తెరిచి చూడగా అంచున నిండిన బంగారు నాణేలు కనిపించాయి.
తరువాత ఈ సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి అందజేశారు. శ్రీరంగం తహశీల్దార్ ఆలయానికి వచ్చి ఈ నాణేల బరువు 1.716 గ్రాములు. ఈ నాణేలపై చారిత్రక శాసనాలు, చిహ్నాలు ఉన్నందున , వాటి వయస్సు , చరిత్రను నిర్ధారించడానికి పురావస్తు శాఖ పరీక్షలు నిర్వహించింది.
ఈ ఆవిష్కరణ స్థానిక నివాసితులు, వారసత్వ ఔత్సాహికులలో గొప్ప ఉత్సాహాన్ని సృష్టించింది. వారు దీనిని తమిళనాడు యొక్క గొప్ప ఆలయ వారసత్వం.. చోళ నాగరికత యొక్క శాశ్వత శ్రేయస్సు యొక్క శక్తివంతమైన జ్ఞాపికగా భావిస్తున్నారు.



