తెలంగాణ
Chevella: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

Chevella: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘటన జరిగింది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.



