తెలంగాణ

నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోపై నేడు సుప్రీంకోర్టులో జరగనుంది.తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కీలక పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారించనున్నది. లక్షలాది బీసీ అభ్యర్థులు, ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారించబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించనున్నారు.

హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకొని రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే హైకోర్టు నిర్ణయం ఉండవచ్చని కూడా న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున, సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలను బట్టే తదుపరి ప్రక్రియలు కొనసాగనున్నాయి.

బీసీ రిజర్వేషన్ల విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్‌ను ఈ నెల 9న జారీచేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button