హీరో నాగార్జున పిటిషన్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున దాఖలు చేసిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తరహాలోనే ఇప్పుడు నాగార్జున కూడా ఊరట లభించినట్లయింది. తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ ను 10 వెబ్ సైట్లు వాడుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిత్వ హక్కులు , నైతిక హక్కులను ఉల్లంఘించకుండా, ఆయన వస్తువులు, సేవలను ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవిగా బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధం విధించింది.



