మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హజారీబాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో ముగ్గురు అగ్రశ్రేణి మావోయిస్టులు మరణించారు. మృతుల్లో కోటి రూపాయల రివార్డు ఉన్న కీలక మావోయిస్టు కమాండర్ సహదేవ్ సోరెన్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ విజయం జార్ఖండ్ పోలీసులకు, భద్రతా దళాలకు ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
హజారీబాగ్ జిల్లాలోని గోరహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అటవీ ప్రాంతంలో నిషేధిత సీపీఐ సంస్థకు చెందిన సహదేవ్ సోరెన్ బృందానికి, భద్రతా బలగాలకు మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కొంతసేపు హోరాహోరీగా జరిగిన పోరాటం తరువాత మావోయిస్టులు భద్రతా బలగాల ముట్టడికి తట్టుకోలేకపోయారు. కాల్పులు నిలిచిపోయిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ గాలింపు చర్యల్లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో మావోయిస్టు రఘునాథ్ హేమంబరం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడిపై 25 లక్షల రివార్డు ఉంది. అలాగే జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజూ కూడా వీరిలో ఉన్నాడు. అతడికి సర్కారు 10 లక్షల బహుమతిని ప్రకటించింది. ఈ ముగ్గురి మృతదేహాలతో పాటు మూడే ఏకే-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా భద్రతా బలగాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. అడవిలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారేమో అని అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో హజారీబాగ్, పరిసర ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.



