కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా..?

Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా..? ఆమె వెనుకుండి నడుపుతున్న అదృశ్య శక్తి ఎవరు.? BRSను డ్యామేజ్ చేసేలా కవిత చేస్తున్న కామెంట్స్‌కి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు? కన్న తండ్రి, సొంత అన్న కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు టార్గెట్‌గా కవిత చేస్తున్న కామెంట్స్‌కు కారణాలు ఏంటి? రాజకీయ చాణక్యుడుగా పేరున్న కేసీఆర్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ముందస్తుగా పసిగట్టలేక పోతున్నారా.?
తెలుగు రాష్ట్రాల్లో చీమల పుట్టల్లా పుట్టుకొచ్చిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని పార్టీలు రాజకీయ పరిస్థితులు, పదవుల వ్యామోహంతో ఇతర పార్టీల్లో విలీనం అయిపోయాయి. మరికొంతమంది నేతలేమో పార్టీ నడపాలంటే ధన బలం, జన బలం లేక సొంత పార్టీలకు ప్యాకప్ చెప్పాల్సివచ్చింది. కొందరు పార్టీల వ్యవస్థాపకులు మొండి కత్తితో యుద్ధం ఎంతకాలం చేయగలం అని కాడే ఎత్తేశారు.
ఇలా అనేక పార్టీలు మఖలో పుట్టి పబ్బలో కనుమరుగయిన చరిత్ర నాటి నుంచి నేటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి తెలంగాణ సిద్ధించే వరకు.. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన అనేక పార్టీలు సవాలక్ష కారణాలతో ప్రజాదరణ పొందలేకపోయాయి. చరిత్రలో ముగిసిన అధ్యాయంలా వర్తమానంలో వాటి గురించి అప్పుడప్పుడు చదవాల్సివస్తుంది.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు అవహేళనలు ఎన్నో ఎన్నెన్నో. అయితే స్వరాష్ట్రం సాధించుకోవాలన్న ప్రజాకాంక్షకు తోడు కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించిన తీరుతో ఆయన్ని ఎగతాళి చేసిన నోళ్లు మూతపడ్డాయి. నవ్విన రాజకీయ దృతరాష్ట్రులను ఓడించేందుకు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చడంలో కేసీఆర్ దిట్ట. అయితే ప్రతీ ఇంటా మట్టి పొయ్యి అన్నట్లు ప్రతి పార్టీలో అంతర్గత పోరు, విబేధాలు సహజం.
TRS ఏర్పాటు మొదలుకొని తెలంగాణ ఉద్యమం అనంతరం రెండు పర్యాయాలు అధికారం వెరసి ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో ఎక్కడా మచ్చుకైనా బయటపడని కల్వకుంట్ల కుటుంబ కలహాలు కవిత రూపంలో బయటకు వచ్చేశాయి. అందులోనూ అధికారం పోయాక బయటపడుతుండటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తుంది. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన కేసీఆర్ తాజాగా కుటుంబంలో, పార్టీలో జరుగుతున్న పరిణామాలు అన్నీ నిశితంగా గమనిస్తున్నారు.
కవితపై వేటు నిర్ణయం పార్టీలో ఎవరైనా ఒకటే అని అది రక్త సంబంధమైనా, కుటుంబ బంధమైనా, పార్టీ పుట్టిపెరిగినప్పటి నుంచి ఉన్నవాళ్లైనా, మధ్యలో వచ్చిన వారు ఎవరైనా సరేగీత దాటితే వేటు అని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్లు కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ తేల్చిచెప్పిందనే పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్‌కు కూతురు కవితపై అమితమైన ప్రేమ ఒక్కమాటలో చెప్పాలంటే కేటీఆర్ కన్నా కవితను ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంటారని ఫ్యామిలీ, పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించేమాట. అయితే పార్టీ అంతర్గత విషయాలను విమర్శిస్తూ కేసీఆర్‌కు కవిత లేఖలు రాయడం, పార్టీలో కొందరు దయ్యాలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఏదో జరుగుతోందని, మున్ముందు తీవ్ర పరిణమాలు ఉంటాయనే టాక్ గత కొన్ని నెలలుగా వినిపిస్తూ వస్తోంది. కల్వకుంట్ల కవిత జైలు జీవితం అనంతరం ఆమెలో అనేక మార్పులు వచ్చాయనే ఆఫ్ ది రికార్డ్ టాక్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టాయి.
కవిత తన ఉనికిని చాటిన పార్టీ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ సొంత కుంపటి రాజేస్తుండటం అధినాయకత్వానికి పంటికింద రాయిలా మారింది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ అనంతరం హరీష్‌రావుపై కవిత ఆరోపణలు భరించలేని పరిస్థితులను తీసుకొచ్చాయి. అన్ని సర్దుకుంటాయని కొంతకాలంగా చూసి చూడనట్లు వదిలేసిన కేసీఆర్ మరి ఊరుకుంటే బాగోదని కవితపై చర్యలు చేపట్టారని పార్టీలో ఆఫ్ ది రికార్డ్‌గానే కాదు ఆన్ రికార్డ్‌గాను బలంగా వాయిస్ వినిపిస్తోంది.
పార్టీకి నష్టం చేకూరేలా కవిత కామెంట్స్ చేసిన కామెంట్స్ వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని BRS నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత చేస్తున్న కామెంట్స్‌ను కాంగ్రెస్ కొట్టి పారేస్తుంది. కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆన్ రికార్డ్‌గా చెబుతున్నారు. అయితే గతంలో ఢిల్లీ లెవెల్‌లో కవిత కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరిగాయని అందుకు రాష్ట్ర నేతలు వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కవిత కాంగ్రెస్‌లోకి తీసుకువస్తే మంత్రి పదవి ఇవ్వాలనే కండిషన్ పెట్టినట్లు చర్చ కూడా జరిగింది అన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చేరిక పార్టీకి నష్టం చేస్తుందని కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ విచ్చిన్నం చేసిందనే అపవాదు మూటగట్టుకోవాల్సివస్తుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు జోరుగా చర్చ నడిచింది.
సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరత, వరదల భీభత్సం-పంట నష్టం.. సంక్షేమం-అభివృద్ధి కుంటుపడిందని, హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలమైందనే స్లోగన్‌తో స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ బలంగా బావించింది. ఈ తరుణంలో కవిత.. పార్టీపై, హరీష్ వంటి ట్రబుల్ షూటర్‌పై వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌కు అందివచ్చని అవకాశంగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్‌లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ వీక్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో జనంలోకి వెళ్తే మంచి వాతావరణం ఉన్న సమయంలో కవిత ఎపిసోడ్…సర్కార్ వ్యతిరేక వాతావరణాన్ని ప్రజల దృష్టి మరల్చేందుకు అధికారపార్టీకి ఉపయోపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కవిత రేపుతున్న పొలిటికల్ దుమారం గులాబీదళాన్ని వీక్ చేసి ఇతర పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు లబ్దిచేకూర్చే విధంగా ఉందనే టాక్ వచ్చింది.
BRS ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి అనేక వివాదాల్లో విచారణల పేరిట కేసులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో BRS చేదు అనుభవం రుచిచూడాల్సి వచ్చింది. తాజాగా కవిత చేస్తున్న కామెంట్స్ ఆమెను సస్పెండ్ చేయడం కౌంటర్‌గా రాజీనామా చేయడం పార్టీని ప్రజల్లో పలుచన చేయడమే అవుతుందన్న భావన గులాబీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. మరోవైపు కవిత వెనుక ఎవరు ఉన్నారనేది సస్పెన్స్ కొనసాగుతుంది. కవిత భవిష్యత్ కార్యాచరణతో త్వరలో ఆ అదృశ్య శక్తి పై క్లారిటీ వచ్చే చాన్స్ ఉందనే టాక్ వస్తోంది.



