జాతియం

జీఎస్టీలో ఇకపై రెండే శ్లాబులు

భారతదేశంలో జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబుల బదులుగా ఇకపై రెండు మాత్రమే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5 శాతం కాగా, మరొకటి 18 శాతం. ఈ నిర్ణయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో తీసుకున్నారు.

దీని ప్రకారం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులు రద్దు కానున్నాయి. గుట్కా, పొగాకు, సిగరెట్లపై మినహా మిగతా ఉత్పత్తులపై కొత్త పన్ను రేట్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. తలనూనెలు, కార్న్‌ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలపై పన్ను తగ్గించనున్నారు. రోటీ, పరోటాలపై పూర్తిగా జీఎస్టీ తొలగించారు. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను ఉండదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మాత్రం ప్రత్యేకంగా 40 శాతం పన్ను విధించనున్నారు.

దాదాపు అన్ని వ్యక్తిగత వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచి, అమెరికా సుంకాల ప్రభావం నుంచి ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. పండగ సీజన్‌లో వినియోగం పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది.

వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం వల్ల కోట్ల మందికి బీమా సులభంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ రాష్ట్రం కూడా వీటిని వ్యతిరేకించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button