నేటి నుంచి రెండ్రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

నేటి నుంచి రెండ్రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. జీఎస్టీలో ఇప్పుడున్న 5, 12, 18 28 శాతం శ్లాబుల స్థానంలో 5, 18 శాతం శ్లాబులను కొనసాగించి, మిగిలిన వాటిని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిస్తుంది. 12, 28 శాతం శ్లాబుల్లో ఉన్న వాటిని 5, 18 శాతం శ్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన.
దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5 శాతం రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. దీన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు ఆహ్వానిస్తూనే.. ఆదాయ నష్టం ఏర్పడితే కేంద్రం భర్తీ చేయాలని కోరుతుండడం గమనార్హం.



