అమెరికాతో ఇండియా, చైనా యుద్ధం

కొత్త మిత్రుడు, పాత శత్రువులు ఇద్దరిలో ఎవరు బెటర్ అన్నది ఎడతెగని ప్రశ్న. దీనికి సమాధానం ఒక్కటే. కొత్త మిత్రుడు కంటే పాత శత్రువు వంద రకాల బెటరని అంటారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం కూడా. ఇండియా అమెరికా విషయంలో మిత్రత్వం ఎన్నాళ్లు చేసినా అది చివరకు బూమ్ రాంగ్ అవుతూనే ఉంటుంది. ఇక చైనాతో మనం ఎంత శత్రుత్వం పెంచుకున్నా ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు నడిపించాల్సిందే. ఎందుకంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు.
పరస్పర అవసరాలు, సందర్భాలు మాత్రమే ముఖ్యమని మనం అంటుంటాం. ఇది చరిత్రలో మరోసారి రుజవవుతోంది. అమెరికా ప్రపంచాన్ని కబలించాలని చూస్తున్న తరుణంలో ఇండియా-చైనా కలిసిపోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయ్. అమెరికా సుంకాల చిచ్చు ఇండియా-చైనాను దగ్గరకు చేరుస్తున్నాయ్. ఐదేళ్ల క్రితం కలకలం రేపిన గల్వాన్‌లో ఘటన తర్వాత ఇరుదేశాలు తిరిగి చర్చలు, సంప్రదింపులు దిశగా అడుగులు వేస్తున్నాయ్.
అమెరికా సుంకాల దాడులు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దన్న ఒత్తిడితో, ఆసియా దిగ్గజాలు రెండు విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి జైశంకర్–వాంగ్ యి మధ్య సమావేశం అదే దిశగా సాగింది. గల్వాన్ ఘటన తరువాత భారత్–చైనా సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై భారీగా సుంకాలు విధించడం, రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీపై ఒత్తిడి చేయడం వంటి పరిణామాల కారణంగా భారత్, చైనా సంబంధాలను పునర్విర్వచించుకోవాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో, చైనా మంత్రి చర్చలు ఇరుదేశాల మధ్య విభేదాలను పక్కనబెట్టి సహకారం పెంపొందించే దిశగా సాగాయి.
రెండు దేశాల సంబంధాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసామని, కానీ ఇప్పుడు ముందుకు సాగాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. చర్చల కోసం పరస్పర గౌరవం, పరస్పర నమ్మకం, పరస్పర ప్రయోజనాలు, విశ్వాసం అవసరమని జైశంకర్ చెప్పారు. ఈ చర్చల్లో ఆర్థిక, వాణిజ్య, సరిహద్దు వాణిజ్యం, టూరిజం ప్యాకేజీలు, నదీజలాల ఒప్పందాలు, ఇరుదేశాల డేటా ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్, చైనాకు స్పష్టం చేసింది. గిల్లికజ్జాల వల్ల ఇరుదేశాలు నష్టపోతాయని, ఒకరి విషయంలో మరొకరు జోక్యం ఉభయదేశాలకు చేటన్న భావన వ్యక్తమైంది. భారత్–చైనా సంబంధాల పురోగతికి శాంతియుత సరిహద్దులు మాత్రమే పునాదిగా ఉంటాయని ఈ సందర్భంగా జైశంకర్ పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి సైతం ఇదే భావన వ్యక్తం చేశారు. ప్రపంచం దేశాలన్నీ గతంలో లేని విధంగా ఒక్కసారి భారీ మార్పులను ఎదుర్కొంటోందని, ఏకపక్ష బెదిరింపులు పెరుగాయని, అమెరికా టారిఫ్స్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం భారత్–చైనా కలిసిపనిచేయాలని ఆయన సూచించారు. భారత్ కోరిన మూడు ముఖ్యమైన అంశాలకు చైనా సహకారం అందిస్తుందన్నారు. ఎరువులు, ఖనిజాల ఎగుమతి, టన్నెల్ బోరింగ్ యంత్రాలు ఎగుమతి, ఆధునిక టెక్నాలజీ బదిలీకి చైనా అంగీకారం తెలిపింది. గత ఏడాది కజాన్‌లో మోడీ–జీ జిన్పింగ్ సమావేశం తరువాత ఇరుదేశాల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా వాంగ్ పర్యటనతో చర్చలు మరింత ముందుకు వెళ్తున్నాయి. అమెరికా భారత్‌పై సుంకాలతో దాడి చేయడం, రష్యా చమురు కొనుగోలుపై ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం కూడా భారత్–చైనా సంబంధాలు మరో మలుపు తీసుకునేలా అడుగులు పడుతున్నాయి.
భారత్‌పై కఠిన చర్యలు తీసుకున్న అమెరికా, చైనాపై మాత్రం అదే రీతిలో ఒత్తిడి చేయలేదు. ఐతే వచ్చే రోజుల్లో ఏమైనా జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఈ నేపథ్యంలో ప్రపంచ సూపర్ పవర్లు కావాలని తహతహలాడుతున్న ఆసియా దిగ్గజాలు ఇండియా-చైనా సమస్యలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించడం అమెరికాకు ఝలక్‌గా భావించాలి. మొన్నటి వరకు చైనాను గిచ్చి ఇండియాను చేరదీయాలని, లేదంటే ఇండియాను గిల్లి చైనాతో పబ్బం గడుపుకోవాలని అమెరికా ఆడుతున్న దొంగాటకు త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. గల్వాన్ ఘటన తరువాత చాన్నాళ్లకు మొదటిసారిగా భారత్–చైనా సంబంధాలు సరైన దిశలో పయనిస్తున్నాయి.



