Revanth Reddy: ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి రాకెట్ సైన్స్ లేదు

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి రాకెట్ సైన్స్ లేదని చెప్పారు. గత పాలకుల అప్పులు, చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎంత కష్టాలు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రతినిధులు కొద్దిమంది అయినా, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులే ప్రభుత్వానికి నిజమైన బలమని చెప్పారు. ఉద్యోగుల డీఏపై తాను సంతకం చేశానని, ప్రభుత్వానికి కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద భీమా కల్పించినట్లు తెలిపారు.
పార్టీ నేతగా రోజుకు 12 గంటలు పనిచేస్తే సరిపోయేదని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇంకా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య పూర్తి విశ్వాసం ఉండాలని కోరారు. పన్నుల వసూళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో జిల్లాల విభజన ఇష్టారాజ్యంగా జరిగిందని, కేసీఆర్ పాలనలో జిల్లాల విభజన సరిగా చేయలేదని వినతులు వస్తున్నాయన్నారు. దీనిపై రిటైర్డ్ జడ్జితో పాటు ఇతర శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలు, మండలాల పునర్విభజనను శాస్త్రీయంగా చేస్తామని, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశాల్లో తుది నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.



