AP: ఏపీలో కొత్త జిల్లాలపై సర్కారు ఫోకస్..!

AP: ఏపీలో జిల్లాల ఎపిసోడ్ ఎంతుకూ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడున్న 26 జిల్లాలతో పాటు మరో ఆరు కొత్త జిల్లాలు రాబోతున్నాయన్న ప్రచారం జరిగింది. కట్ చేస్తే కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు రెండే అని కొత్త టాక్ బయలుదేరింది. దీంతో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయా ఎడతెగని పంచాయితీకి సీఎం చంద్రబాబు ఎండ్ కార్డ్ వేయబోతున్నారా? జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాల వివాదానికి చెక్ పెట్టబోతున్నారా? కొత్తగా ఏర్పడే రెండు జిల్లాలు ఏవి? అమరావతిని జిల్లా కేంద్రం చేయట్లేదా?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై స్పష్టత వచ్చింది. పలు ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం వద్దకు వచ్చాయి. రెవిన్యూ డివిజన్లు మండలాల కూర్పు పైన కసరత్తు జరిగింది. తాజాగా సీఎం చంద్రబాబు తో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని అదే సమయంలో త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం ఉండాలని స్పష్టం చేసారు. దీంతో ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు వేగవంతం అయింది.ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనకు రంగం సిద్దం అవుతోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు పెరగనున్నాయి. కొత్తగా జిల్లాలపై దాదాపు స్పష్టత వస్తోంది.
అయితే ఏపీలో జిల్లాల పునర్విభజన, మండలాల సరిహద్దుల నిర్ణయం అంశం ఎటూ తేలడం లేదు. గత 2024 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే ప్రజల అభీష్టం మేరకుకొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, మండలాల సరిహద్దులను మారుస్తామని అవసరమైతే కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో దీనిపై తర్వాత చూద్దామని గత ఏడాది గడిపేశారు. నిజానికి ఇది మళ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు చేపట్టాలని తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు అంత అర్జంట్ ఏముంటుంది? అనుకున్నారు. అయితే ఇంతలోనే కేంద్రం నుంచి ఉరుములు లేనిపిడుగులా పెద్ద సమాచారం వచ్చింది.
2026 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా కుల, జనాభా గణనల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈక్రమంలో జిల్లాలు, మండలాల సరిహద్దులను మార్చాలని అనుకుంటే 2025 డిసెంబరు 31లోగా ముగించాలి. జనవరి 2026 నుంచి ఇలాంటి ప్రక్రియ చేపట్టవద్దని తేల్చి చెప్పింది. అంతేకాదు కుల, జనాభా గణనల వ్యవహారం 2028 చివరి వరకు జరగనుంది. ఈ లెక్కన చూస్తే 2029 ఎన్నికలు వచ్చేస్తాయి. దీంతో ఆగమేఘాలపై సీఎం చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో వేసిన కమిటీ పనిచేయాలని ముందుకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య వెంటాండింది. దీంతో జిల్లాలపై కాన్సన్ట్రేషన్ చేయలేక పోయారు. మరోవైపు జిల్లాల విభజన, మండలాల పరిధిలు నిర్ణయించేం దుకు కేవలం 60 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది.
ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలు ఉండగా..ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ 26 జిల్లాలుగా విభజించింది అప్పటి వైసీపీ సర్కార్. ఇక ఏపీలో 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. అయితే లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాల విభజన చేయడంతో చాలా సమస్యలు వచ్చాయంటోంది కూటమి ప్రభుత్వం. జిల్లా కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో మండలాలు, డివిజన్లు ఉండటంతో సొంత జిల్లాకు దూరంగా పక్కా జిల్లాకు అతి దగ్గరలో ఉండేలా అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేశారని ఎన్నికల ముందే ప్రచారం చేశాయి కూటమి పార్టీలు.
అలాగే ఎన్నికల సమయంలో జిల్లాల ఏర్పాటుపై కూడా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స్టడీ చేసేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటి వరకు 12 వేల వినతులు వచ్చాయి. జిల్లాల నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలతో ఆ శాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.
ఇక, రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్వ్యవస్థీకరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్నీ ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది.
భవిష్యత్‌లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాల పై నిర్ణయం జరగాలని సీఎం సూచించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికని గుర్తుచేశారు. పోలవరం ముంపు మండలాలపై కూడా స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు.
ఎన్నికల సమయంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆల్ మోస్ట్ ఫైనల్ అని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లెను కూడా జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చిందట. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తుందట.
పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలన్నది పెద్ద సమస్య. వాటిని ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా 28 నియోజకవర్గాల్లోని 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్ వ్యవస్థీకరించాలని ప్రతిపాదనలు వచ్చాయట.
అయితే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను విభజించి జిల్లాల సంఖ్యను 32కు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి మారిందని కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులు మార్చడానికే పరిమితమవ్వాలని నిర్ణయించినట్లు టాక్. గతంలో పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో పరిపాలన సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు.
అల్లూరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గానికి దగ్గరలో రాజమండ్రి ఉంది. కానీ, రంపచోడవరాన్ని పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి జిల్లాలో కలపడంతో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న చింతూరు, పోలవరం ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వెళ్లడం కన్నా, రాష్ట్ర రాజధానికి చేరుకోవడమే ఈజీగా ఉంటోంది. దీంతో ఈ ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందట. పుంగనూరు లేదా పీలేరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతమున్న 10 రెవెన్యూ డివిజన్లలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేట పట్టణానికి మార్చాలని వచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదనలను వచ్చినట్లు చెబుతున్నారు. సేమ్‌టైమ్ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును తిరిగి నెల్లూరులో విలీనం చేస్తారని చెబుతున్నారు.
ఏదైనా డిసెంబర్ 31లోపు జిల్లాల అంశాన్ని కొలిక్కి తేబోతున్నారట. త్వరలో జనగణన చేపట్టనుండటంతో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగానే జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లోగానే రెండు కొత్త జిల్లాలకు, నాలుగు రెవెన్యూ డివిజన్లకు, సరిహద్దుల మార్పునకు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆమోదం తెలుపుతారని అంటున్నారు.



