తెలంగాణ

Rajagopal Reddy: ట్రిపులార్ అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో

Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చౌటుప్పల్ డివిజన్‌లోని ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు తొక్కని గడపలేదని అన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరుగలేదని చెప్పారు. ట్రిపులార్ రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కీలక ప్రకటన చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూనిర్వాసితులతో రాజగోపాల్‌రెడ్డి సమావేశం అయ్యారు. దివీస్ యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్ మెంట్ మార్చారని, ఇప్పుడు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ మారాలంటే ఉత్తర భాగం మారాలని, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమోనని ఆయన అన్నారు.

గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. నా రాజీనామాతోనే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. పదవిపై నాకేం ఆశ, వ్యామోహం రెండూ లేవు కానీ నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించను. ఎంతవరకైనా వెళ్తాను. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే.. ఆ పని చేయడానికి కూడా నేను వెనుకాడను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని, ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరం అయితే ట్రిపుల్‌ ఆర్ రద్దైనా సరే భూనిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసాను ఇచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంబింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు

. ప్రజలే తన బలం, బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికి అయినా, అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button