జనసేనలో బాలినేని ఒంటరయ్యారా..?

ఆ మాజీ మంత్రి సొంత పార్టీలోనే పరాయి వారైపోయారా పార్టీ కార్యక్రమాలకు కనీసం ఆయన్ని పిలిచే దిక్కు కూడా లేకుండా పోయిందా ఆ పార్టీ ఫ్లెక్సీల్లో కనీసం ఆయన ఫోటో కూడా పెట్టడం లేదా ఇంతకీ ఆ పార్టీ శ్రేణులు ఆయనపై ఎందుకంత అసంతృప్తిగా ఉన్నాయి. ఆయనపై క్యాడర్ లో ఎందుకంత అసహనం పెరుగుతోంది. చివరకు పాపం ఆ మాజీమంత్రి గత ప్రభుత్వాల్లో ఎలా ఉండేవారు. ఇప్పడు ఎలా ఉన్నారనే చర్చ కూడా స్థానికుల్లో నడుస్తోందట.
కారణాలు ఏమైనా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత ఒంటరైనట్లే కనిపిస్తోంది. గతంలో జిల్లాను మొత్తం శాసించే పరిస్థితి ఉండగా ప్రస్తుతం పట్టుకోల్పోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జనసేనలో రాజకీయ కలకలం రేపుతున్న ఆ సీనియర్ లీడర్ ఎవరు ఎందుకు ఆయన పరిస్థితి దయనీయంగా మారిపోయింది. వాచ్ దిస్ స్టోరీ.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఒంటరయినట్లే కనిపిస్తుంది. గతంలో జిల్లాను మొత్తం శాసించిన బాలినేని ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా పట్టుకోల్పోయారు. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిక బాగానే జరిగినప్పటికీ కొన్ని నెలల నుంచి ఆయనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదట. చివరకు ఒంగోలు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కూడా మొహం చాటేస్తున్నారట.
బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా ఆయనకు నేతలు వంగి వంగి సలాములు చేసే వారు. జిల్లాలో అసెంబ్లీ టిక్కెట్లు కూడా ఆయన చెప్పిన వారికే వచ్చేవి. చివరకు పార్లమెంటు సభ్యులను సైతం ఆయన కంట్రోల్ లో పెట్టారంటారు.
కానీ జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక ఇటు వైసీపీలో ఉన్న క్యాడర్ కు కూడా ఇష్టం లేదట. జనసేన పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా ఆయనపట్ల సుముఖంగా లేరట. పార్టీ పదవులు జిల్లాల్లో ఇస్తున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఆయనను పార్టీ నాయకత్వం సంప్రదించే పరిస్థితుల్లో లేదు. పవన్ కల్యాణ్ తనను కొన్ని సార్లు ప్రశంసించడంతో తనకు ప్రాధాన్యత ఇస్తారని నమ్మి వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డికి దాదాపు ఏడాది గడిచినా ఎటువంటి పదవి దక్కలేదు.
జనసేనలో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటకు వస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై పార్టీ క్యాడర్‌లో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన తర్వాత, రాజకీయ దిశలో బాలినేని చూపుతున్న తీరుపై నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జనసేనలో చేరిన తర్వాత బాలినేని రాజకీయ చురుకుదనం తగ్గిందని, స్థానిక స్థాయిలో కార్యకర్తలతో అనుసంధానం లోపించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో జరిగే కీలక సమావేశాల్లో ఆయన గైర్హాజరు కావడం, కొన్ని సందర్భాల్లో పార్టీ నిర్ణయాలపై భిన్న స్వరం వినిపించడం — ఈ అంశాలు గ్రౌండ్ లెవల్‌లో ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది.
బాలినేని ఇటీవల కొందరు పాత సహచర నేతలతో గోప్యంగా భేటీ అయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన భవిష్యత్తు రాజకీయ పథకం ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టంగా లేకపోవడం, పార్టీ కార్యకర్తల్లో సందేహాలను పెంచుతోంది. పార్టీ అధిష్ఠానం మాత్రం ఈ పరిణామాలపై మౌనం పాటిస్తోంది. కానీ బాలినేని పట్ల క్యాడర్‌లో అసంతృప్తి కొనసాగితే, ఇది పార్టీకి భవిష్యత్తులో తలనొప్పిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావాల్సిన సమయంలో ఇలాంటి అంతర్గత ఉద్రిక్తతలు పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
బాలినేని తన అనుభవం, ప్రజాదరణతో జనసేనకు బలాన్ని తీసుకొస్తారనే ఆశలు ఉన్నాయి. కానీ పార్టీ అంచనాలకు తగిన స్థాయిలో ఆయన చురుకుదనం చూపకపోతే, వచ్చే ఎన్నికల్లో ఆయన పాత్ర ప్రశ్నార్థకమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనపై ఉన్న విమర్శల మధ్య, బాలినేని రాజకీయ భవిష్యత్తు ఏ దిశలో పయనిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జనసేనలో చేరిన నేతలు మినహా పాత నేతలు ఎవరూ ఆయన దగ్గరకు రావడం లేదట. దీంతో ఒంగోలులోని బాలినేని ఇల్లు బోసిపోయి కనిపిస్తుందంటున్నారు. ఇక జనసేనకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఆయనకు కనీసం పిలుపు లేదనే టాక్ వినిపిస్తోంది. కనీసం జనసేన నేతలు వేస్తున్న ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫొటో కనిపించడం లేదట.
దీంతో బాలినేని జనసేనలో ఎందుకు చేరినట్లు? ఏమి సాధించినట్లు? అన్న కామెంట్స్ ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులో ఉండకుండా ఎక్కువగా హైదరాబాద్ లోనే గడుపుతూ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. చివరకు బాలినేని పరిస్థితి ఇలా తయారైందేమిటన్న వ్యాఖ్యలు ఒంగోలులో వినపడుతున్నాయి.



