Muhammad Yunus: రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..?

Muhammad Yunus: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఇప్పుడు ఆయన కూడా ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
NCP చీఫ్ నహిద్ ఇస్లామ్, యూనస్ రాజీనామా గురించి స్పందించారు. ఆయన రిజైన్ అంశంపై మాట్లాడుతానని చెప్పారు. కాగా ఇటీవల కాలంలో యూనస్ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్- ఉజ్- జమాన్‌తో నెలకొన్న విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకొంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈక్రమంలోనే ఎన్నికల నిర్వహణపై ఇటీవల వకార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనా ఆయన అభ్యంతరం తెలిపారు. పదహారేళ్లపాటు కొనసాగిన షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం వల్ల పతనమైంది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు.