Trump-Jinping: ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ

Trump-Jinping: రెండు దేశాలు ప్రపంచంలోనే అగ్రగాములు. నెంబర్ 1 కావడం కోసం ఇరు దేశాలు పోటీపడుతున్నాయ్. కానీ ఒకరికి ఒకరిపై విశ్వాసం మాత్రం ఉండదు. ఒకరికి మరో దేశం ఉత్పత్తులు లేకుండా మనుగడ సాధ్యం కాదు. కానీ ప్రతి నిమిషం ఆ దేశంపై సుంకాలంటూ బెదిరింపులకు దిగుతుంది. ఒకరోజు టారిఫ్స్ వందంటాడు. ఇంకోసారి రెండొందలంటాడు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్. కానీ చైనా నుంచి గుండు సూది కూడా దిగుమతి చేసుకోకుండా ఆ దేశం బతకలేదు.
పైకి ఢిష్యుం ఢిష్యుం అనుకున్నా, తాజాగా మేమిద్దరం కలిసిపోయామంటూ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. పరస్పరం ఒకరికి ఒకరం సహకరించుకుంటామంటూ కొత్త పల్లవి అందుకోవడం దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా ఆసక్తికర ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఆరేళ్ల విరామం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశం కొత్త పేజీని లిఖించింది.
వాణిజ్య యుద్ధం, సుంకాల ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ భేటీ అరుదైన భూముల ఒప్పందంతో ముగిసింది. రక్షణ, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు కీలకమైన ఈ అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో అమెరికా-చైనా మధ్య ఒక సంవత్సరానికి సరిపడే తాత్కాలిక ఒప్పందం కుదిరింది. భేటీ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నామన్నాడు ట్రంప్.
చైనా-అమెరికా కలయిక ప్రపంచం కోసం మంచిదన్నాడు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన రెండు దేశాల ఒప్పందం ఏడాది పాటు కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం తిరిగి చర్చించుకొని కొనసాగేలా చేసుకుంటామన్నాడు. ఏప్రిల్‌లో తాను చైనా వెళ్తానన్న ట్రంప్, ఆ తర్వాత జిన్‌పింగ్ అమెరికాకు వస్తాడన్నాడు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణలు గత ఏడాది నుంచి పెరుగుతూ వచ్చాయి. ఐతే తాజా డీల్ గ్లోబల్ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చే పరిణామమని చెప్పాలి. గత నెలలో బీజింగ్ అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణ విధించడంతో అమెరికా బోరుమంది. అమెరికా తయారు చేసే అనేక ఉత్పత్తులు, చైనా ఎగుమతుల నిషేధంతో ఆగిపోయాయి. దీంతో చైనాపై అమెరికా 100 శాతం సుంకాలు ప్రకటించింది. దీంతో మరో వాణిజ్య యుద్ధం మొదలవుతుందా అన్న చర్చ సాగింది. కానీ, బుసాన్ సమావేశంలో రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాయి.
జీ జిన్‌పింగ్ ఒక శక్తివంతమైన దేశానికి గొప్ప నాయకుడని ట్రంప్ కితాబివ్వడమే కాదు. తమ భేటీలో చైనా అధ్యక్షుడికి 10కి 12 మార్కులిస్తానంటూ పొగడ్తలతో ముంచెత్తాడు అమెరికా అధ్యక్షుడు. వాణిజ్య ఒప్పందాలతోపాటుగా, ఫెంటానిల్ సమస్యపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఆపరేషన్ చేసే సమయంలో, ఆ తరువాత తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఫెంటానిల్ ఇంజెక్షన్ ఉపయోగిస్తారు. ఐతే, అమెరికాకు అక్రమంగా చేరుతున్న ఫెంటానిల్ రవాణాను నియంత్రించడంలో చైనా సహకరిస్తుందని జీజిన్పింగ్, హామీ ఇచ్చాడని ట్రంప్ చెప్పాడు.
భేటీ తర్వాత ట్రంప్ తీరుపై, జీజిన్పింగ్ సానుకూలంగా స్పందించాడు. పలు అంశాల విషయంలో, ఘర్షణలు సహజమన్న ఆయన చైనా-అమెరికా సంబంధాలు సరైన మార్గంలో ఉండాలన్న అభిలాష వ్యక్తం చేశాడు. ఇరుదేశాలు భాగస్వాములు, స్నేహితులుగా ఉండాలన్నాడు. బాధ్యతను పంచుకోవాల్సిన వారు కలహించుకోవడం మంచిది కాదన్నాడు.
ఈ సమావేశం ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార ఎపెక్ సమ్మిట్ సందర్భంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన, సాంకేతిక, సైనిక ఉద్రిక్తతల మధ్య ఈ భేటీ సాగింది. అమెరికా టెక్నాలజీపై చైనాకు ఉన్న ఆధారపడే స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అరుదైన ఖనిజాల విషయంలో మాత్రం వాస్తవాన్ని ఆ దేశం అంగీకరించాల్సి వస్తోంది.
వాణిజ్య యుద్ధం శిఖరానికి చేరుకున్న సమయంలో ఇరు దేశాలు కాస్తా వెనక్కి తగ్గడం, ఫెంటానిల్ సుంకాలను 20 నుండి 10 శాతానికి తగ్గించడంపై అమెరికా ఒప్పుకోవడం కూడా కీలకాంశంగా చెప్పాలి. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ తిరిగి అంతర్జాతీయ వేదికపై చురుకైన చర్చలతో ముందుకు సాగుతుండగా, జిన్‌పింగ్ కూడా చైనాకు ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి దౌత్య మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. బుసాన్ సమావేశం వాణిజ్య యుద్ధాలను ఆపే దిశగా సాగిందా.. లేదంటే వచ్చే రోజుల్లో మరింత రచ్చకు కారణమవుతుందా అన్నది త్వరలో తేలనుంది.



