తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా? సీఎం రేవంత్ వర్సెస్ కేసీఆర్ వాటర్ వార్ నడుస్తుందా? సభలో పవర్ పార్టీ ప్రెజెంటేషన్ మాత్రమే ఉంటుందా? ప్రతిపక్షపార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుందా? అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ ఎందుకు డిసైడ్ చేయలేకపోయింది? మూడు రోజులు గడిచిన తర్వాత, అది కూడా కేసీఆర్ వచ్చేది రానిది తెలుసుకుని సభ ఎన్ని రోజులు నడుపాలనేది ప్రభుత్వ వ్యూహమా? లేదంటే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వకుండా బుల్డోజ్ చేస్తూ బిల్లులు, ఆర్డినెన్స్‌లను ఆమోదించుకుని సభకు నమస్కారం అననున్నారా? అందరూ సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే హిల్ట్ పాలసీపై సైతం చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టే అవకాశం ఉంది.
లక్షల కోట్ల భూమి కుంభకోణం అని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. పంచాయతీ పోరులో పై చేయి సాధించామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ పరిషత్ పోరుకు సిద్దమవుతుందని అంతా భావించారు. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాత 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో సభలో దీనిపై అధికార ప్రతిపక్షాల వార్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటర్ లిస్టుల తయారీలో నిమగ్నమైంది. మెగా జీహెచ్ఎంసీ, కమిషనరేట్ల పరిధి విస్తరించడం కూడా హైదరాబాద్‌తో సమీప జిల్లాల రాజకీయాలను మార్చబోతోంది.
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సంతకం పెట్టడం, తాను డిమాండ్ చేసినట్లు నీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సర్కార్ ఒప్పుకుంటే సభకు వచ్చే ఛాన్స్ ఉండటం, మున్ముందు దక్షిణ తెలంగాణలో బహిరంగ సభలకు ప్లాన్ చేయడం..హాట్ టాపిక్స్ అవుతున్నాయి. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ కరచాలనం చేసుకున్నా సభలో పుట్టే హీట్‌తో ఆ వాతావరణం ఉండదని మళ్లీ మాటల యుద్ధం తప్పదని విశ్లేషకులు చెప్పే మాట.



