Telangana Cabinet: తెలంగాణ సర్కార్లో మార్పులు-చేర్పులు

Telangana Cabinet: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సయోధ్య వచ్చిందో రాలేదో తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏదో జరగబోతుందన్నట్టుగా కన్పిస్తోంది. ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదన్నట్టుగా సీన్ మారుతోంది. సుమారుగా అరడజను మందిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశమున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో పీసీసీ చీఫ్ మార్పు కూడా తధ్యమంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాను కేబినెట్ లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న తరుణంలో ఆయన ప్లేస్లో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుకు పీసీసీ ఇస్తారన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయ్.
కేబినెట్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తోపాటు మరో ఇద్దరిని కూడా తప్పించే అవకాశముందంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, ఇక కొండా సురేఖ స్థానంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి లేదంటే విజయశాంతికి అవకాశమిచ్చే అవకాశముందంటున్నారు. ఇక జూపల్లి కృష్ణారావు స్థానంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు చాన్స్ దక్కొచ్చంటున్నారు. పొన్నం ప్రభాకర్ ను ఏఐసీసీలోకి తీసుకొని ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కేబినెట్లోకి వస్తారంటున్నారు.
అదే సమయంలో పీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబును తీసుకుంటారని, ఆయనకు హోం శాఖ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఒకరిద్దరు మంత్రులకు కూడా ఉద్వాసన తప్పదన్న సంకేతాలు వస్తున్నాయ్. అదే సమయంలో గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మల్ రెడ్డి రంగారెడ్డికి కూడా చాన్స్ లభించవచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయ్. మొత్తంగా కేబినెట్ లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా, ఇప్పుడు మరికొందరిని తొలిగించబోతున్నారన్న వార్తలు కొత్త ఊహాగానాలకు అవకాశమిస్తున్నాయ్.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కేబినెట్ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కన్పిస్తోంది. పీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబు లాంటి సీనియర్ ను ముందుకు తీసుకురావడం వెనుక వచ్చే రోజుల్లో జడ్పీటీసీ , మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యమన్నట్టుగాతెలుస్తోంది.



