జాతియం

తమిళనాడు తొక్కిసలాటలో 40 మంది మృతి

తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. వీరిలో 16మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. మరో 50మందికిపైగా గాయపడగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా, విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో గంటగంటకూ జనం రద్దీ పెరిగింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 50 వేల మంది జనం పోగయ్యారు. అయితే, మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండటంతోపాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్ పై నిలబడి మాట్లాడుతుండగా ఆయనను దగ్గర నుంచి చూసేందుకని జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొందరు కిందపడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కిందపడిపోయారు. జనం ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్​లు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్​లకు దారి ఇవ్వాలంటూ బస్​ పైనుంచి విజయ్ సూచించడం వీడియోల్లో కనిపించింది.

విజయ్ ర్యాలీకి 10 వేల మంది వరకూ వస్తారని అంచనా వేస్తున్నట్టుగా పర్మిషన్ కోసం పోలీసులకు ఇచ్చిన లెటర్​లో పేర్కొన్నారు. కానీ 50 వేల మంది వరకూ వచ్చారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూర్ నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button