నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు

నేపాల్‌ను మరోసారి వరద ముప్పు భయపెడుతోంది. దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చౌలాని నది ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. నది ప్రవాహం అడ్డంకికి గురికావడంతో ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, కొండచరియల కారణంగా నది ప్రవాహంలో మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చౌలాని నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నది వైపు వెళ్లొద్దని సూచించారు. తాజా పరిస్థితులపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.



