నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు సజీవంగా బయటకు!

వరదలతో అతలాకుతలమైన నేపాల్లో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ విపత్తు సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత రసువా జిల్లాలోని త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సొరంగం నుంచి భద్రతా బలగాలు ఇద్దరిని రక్షించాయి. దెబ్బతిన్న సొరంగం నుంచి మనుషుల మాటలు వినిపిస్తున్నట్లు ఆ దేశ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సభ్యుడు శ్రీరామ్ న్యూపానే తొలుత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అందులో చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నట్లు నిర్దారణకు వచ్చిన రెస్క్యూ సిబ్బంది.. సొరంగంలోని బురదను తొలగిస్తూ ఇద్దరిని సజీవంగా బయటకు తీసుకొచ్చారు.
ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులను మెకానికల్ ఫోర్మెన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్గా గుర్తించారు. ఆగస్టు 26న సంభవించిన విపత్తు తర్వాత.. త్రిశూలి-3A కేంద్రంలో 40మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అడ్డుగా ఉన్న బురద, శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలు, ప్రత్యేక పరికరాలను మోహరించారు. మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల సహాయక చర్యల్లో జాప్యం నెలకొంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు లాంగ్టాంగ్ ఖోలా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
వరదల ధాటికి రసువా, నువాకోట్ జిల్లాల్లో 12 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 600 మంది విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. గల్లంతైన విద్యార్థుల కచ్చితమైన సంఖ్యను సేకరించడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విద్యార్థులతో పాటు 22 మంది ఉపాధ్యాయులు, పలువురు సిబ్బంది గల్లంతైనట్లు తెలిపారు.



