Pawan Kalyan: ప్లాప్ డైరెక్టర్లని ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాప్ డైరెక్టర్లకు దేవుడిలా మారాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత ఆయనతో పని చేసిన దర్శకులందరి మునుపటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ విషయం అభిమానుల్లో ఆసక్తికర చర్చను రేకెత్తిస్తోంది. ఇది యాదృచ్ఛికమా లేక ఎంపికలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విలువైన అవకాశాలు ఇచ్చి, వారిని ఎంతగానో ఆదుకున్నాడు.
2018లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత, పవన్ ఎంచుకున్న దర్శకులందరి మునుపటి ప్రాజెక్టులు వాణిజ్యపరంగా నిరాశపరిచిన నేపథ్యం ఆసక్తికరంగా మారింది. ‘వకీల్ సాబ్’కు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ మునుపటి చిత్రం ‘ఎంసీఏ’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితం సాధించలేదు. అలాగే ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర మునుపటి చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా అంచనాలను అందుకోలేదు. ‘బ్రో’ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని మునుపటి ‘విమానం’ విఫలమైంది.
‘హరి హర వీర మల్లు’ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మునుపటి ‘కొండపొలం’ కూడా నష్టాలను మూటగట్టుకుంది. ఇక జ్యోతి కృష్ణ ప్లాప్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ మునుపటి ‘సాహో’ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ నిరాశ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో చేస్తున్న ప్రాజెక్టు పీఎస్‌పీకే32కు ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్’ పరాజయం పాలైంది. ఇది యాదృచ్ఛికమా లేక ఎంపికలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విలువైన అవకాశాలు ఇచ్చి, వారిని ఎంతగానో ఆదుకున్నాడు. అభిమానులు ఈ విషయాన్ని గమనిస్తూ ఆసక్తిని కనబరుస్తున్నారు.



