హృతిక్ వ్యాఖ్యలకు ఆదిత్య ధర్ స్పందన.. ‘ధురంధర్ 2’ ఖరారు!

బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూనే కొన్ని రాజకీయ అంశాలను అంగీకరించనని వ్యాఖ్యానించారు. దీనిపై దర్శకుడు ఆదిత్య ధర్ సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా ‘ధురంధర్ పార్ట్ 2’ కూడా రానుందని స్పష్టం చేశారు.
డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ చిత్రం రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా నటనతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్న నేపథ్యంలో హృతిక్ రోషన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
చిత్రం హృదయానికి దగ్గరైందని, దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతంగా తెరకెక్కించారని హృతిక్ కొనియాడారు. అయితే ఇందులోని కొన్ని రాజకీయ అంశాలను తాను అంగీకరించనని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ హృతిక్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. చిత్రంపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, చిత్ర యూనిట్ అంతా చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘ధురంధర్’కు సీక్వెల్ ఉంటుందని, పార్ట్ 2లో అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



