చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఎఫ్సీఆర్ఏ అనుమతి!

మెగాస్టార్ చిరంజీవి నడిపిస్తున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్ర హోం శాఖ ఎఫ్సీఆర్ఏ గుర్తింపు లభించింది. ఇకపై విదేశాల నుంచి విరాళాలు స్వీకరించే అవకాశం కలిగింది.
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ గత ఇరవై ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్విహిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ఈ ట్రస్ట్ లక్షలాది మందికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు దేశీయ విరాళాలతోనే ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఇటీవల కేంద్ర హోం శాఖ ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) అనుమతి మంజూరు చేసింది. దీంతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాసులు, ఇతర దాతల నుంచి నేరుగా విరాళాలు స్వీకరించే మార్గం సుగమమైంది. ఈ అనుమతితో చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించే అవకాశం ఉందని చిరంజీవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



