బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త

కట్టుకున్న భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడో భర్త. బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్‌ను పోస్ట్‌లో పంపాడు భర్త. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ముద్దనూరుకు చెందిన మారుతిరాజుకు14 ఏళ్ల క్రితం కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మితో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన భర్త సంపాదించిన డబ్బంతా తాగుడికే తగలబెట్టేవాడు. ఈ క్రమంలో భర్తపై కోపంతో భార్య ఆదిలక్ష్మి 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని అసహనానికి గురైన మారుతిరాజు భార్య చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ రావడంతో దానిని పోస్టులో పంపాడు. భర్త నుంచి ఊహించని పరిణామం ఎదురవ్వడంతో భార్య అవాక్కైంది. బతికున్న తనకు డెత్ సర్టిఫికెట్ రావడంతో ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెత్ సర్టిఫికెట్ పంపిన భర్తతో పాటు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదిలక్ష్మి డిమాండ్ చేస్తోంది.



