ఆంధ్ర ప్రదేశ్

ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు సారీ చెప్పారు..?

Praveen Prakash: మాజీ ఐఎఎస్‌ అధికారి ప్రవీణ్‌ప్రకాష్‌ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారా? లేక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా? ఈ రెండూ కాకుండా.. తన ఐఎఎస్‌ తెలివి తేటలతో కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారా? సర్వీస్‌లో ఉన్నప్పుడు తప్పులు చేశానంటూ ఇప్పుడు తాపీగా విచారం ప్రకటించడం వెనకున్న వ్యూహం ఏంటి? వీఆర్‌ఎస్‌ తీసుకున్నాక ఆయన వైఖరి ఎందుకు మారిపోయింది? వైఎస్ జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగి చంద్రబాబు రాగానే వీఆర్ఎస్ తీసుకుని ఇంటికెళ్లిపోయిన మాజీ ఐఏఎస్‌ ప్రవీణ్ ప్రకాష్ కు నిద్రపట్టడం లేదు. తాను చేసిన తప్పులు చూస్తూ ఉండిపోయిన తప్పులు చూసి ఆయన కుమిలిపోతున్నారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జగన్ హయాంలో ఉన్నతాధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్‌లకు అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోయాయనన్నారు.

సర్వీస్‌లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, నడిపిన వ్యవహారాలకు సంబంధించి అధికారులు, అందునా ఐఎఎస్‌లు విచారం ప్రకటించడం అత్యంత అరుదు. అందులోనూ సర్వీస్‌ మేటర్స్‌, పొలిటికల్‌ డెసిషన్స్‌ మీద కామెంట్స్‌ చేయడం వెరీ రేర్‌. అలాగే క్షమాపణలు కోరడమైతే బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే ఇప్పుడు ఏపీ కేడర్‌ మాజీ ఐఎఎస్‌ ప్రవీణ్‌ప్రకాష్‌వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఈ ఉన్నతాధికారి జగన్‌ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వంలో అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కానీ సడన్‌గా ఇప్పుడు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది.

గతంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నానంటూ పశ్చాత్తాపం ప్రకటించి సారీలు చెప్పడంపై ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ప్రవీణ్‌ప్రకాష్‌ వ్యూహం ఏమై ఉంటుందా అని తెగ ఆరాలు తీసేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. అసలాయన కెరీర్ మొత్తం ఒక ఎత్తైతే వైసీపీ హయాంలోని ఐదేళ్లు మరో ఎత్తని ఐఏఎస్‌ వర్గాలే మాట్లాడుకుంటాయి. అప్పట్లో సీఎంవో కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శిగా బహుముఖ పాత్ర పోషించారు ప్రవీణ్‌ ప్రకాష్‌.

విద్యాశాఖలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక వీఆర్ ఎస్‌కు దరఖాస్తు చేయడం, ఆమోదం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ మాజీ ఐఎఎస్‌ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో చుట్టూ కొత్త చర్చ మొదలైంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను వ్యవహరించిన తీరుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సర్వీసులో ఉండగా వారి పట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. గతేడాది తనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని ప్రవీణ్ ప్రకాశ్ గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో తన ప్రవర్తన గురించి పునరాలోచించుకున్నానని, తాను చేసింది తప్పని గ్రహించానని వివరించారు. ఈ నేపథ్యంలోనే తాను బాధపెట్టిన అధికారులకు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన చర్యల వల్ల ఇబ్బందిపడిన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిశోర్‌ను క్షమించమని కోరారు. అదే సమయంలో, తన 30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. కేవలం కొందరు వ్యక్తుల పట్ల తన ప్రవర్తన సరిగా లేదని అంగీకరించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఏడాది కంటే ఎక్కువ కాలం గడిచింది. అయితే ఆయన ఇప్పుడు ఇద్దరు అధికారులకు బహిరంగ క్షమాపణలు చెప్పడమేంటనే చర్చ సాగుతోంది.

అపరాధ భావనే తనను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకునేలా చేసిందని ప్రవీణ్ ప్రకాష్ అంటున్నారు. 2020లో జగన్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు, AB వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తూ DGP కార్యాలయం నుండి ఒక ఫైల్ అందిందని వెల్లడించారు. తాను సరైన ఆలోచన చేయకుండానే ఆ ప్రక్రియను ఆమోదించానని, అయితే ఇప్పుడు అది తప్పని తనకు అర్థమైందంటున్నారు. సాంకేతికంగా, AB వెంకటేశ్వరరావు చేసింది తప్పు కావచ్చు, కానీ నైతికంగా అతని వైపు నుండి ఎటువంటి తప్పు జరగలేదని మాజీ IAS అధికారి అంటున్నారు. IRS అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కేసులో కూడా ప్రవీణ్ ప్రకాష్ తన తప్పును అంగీకరించారు, ఇద్దరు అధికారులకు కలిగిన బాధకు క్షమాపణలు తెలిపారు.

ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారో కానీ తాను చేసిన పనికి తనకు నిద్రపట్టడం లేదని ఆయన చెబుతున్నారు. ఆయన ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనైతే కోర్ట్‌ ఆదేశాలను కూడా సరిగా అమలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. వాటన్నిటిపై ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం ప్రకటించి సారీ చెప్పారు మాజీ ఐఎఎస్‌.

అయితే ఆయనలో సడన్‌గా ఇంత మార్పును ఊహించలేదని, దీని బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ కూడా వేరే ఏదో ఉండి ఉంటుందన్న అనుమానంతో వెదుకుతున్న వాళ్ళకు కొత్త సంగతులు తెలుస్తున్నాయట. వీఆర్‌ఎస్‌ తీసుకున్నాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలోప్రవీణ్‌ మనసు పాలిటిక్స్‌ వైపు మళ్ళిందని అంటున్నారు. మరోవైపు ఆయన వీఆర్ఎస్ పూర్తి అయిపోయింది. మళ్లీ దాన్ని రీవోక్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారేమో కానీ ఇలా క్షమాపణలు చెబుతున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button