తిరుమల పరకామణి చోరీ కేసు.. డాక్యుమెంట్లు సీజ్ చేసిన సీఐడీ

శ్రీవారి ఆలయ పరకామణి డాలర్ల చోరీ వ్యవహారంలో సీఐడీ దూకుడు పెంచింది. చోరీకి సంబంధించిన కేసు నమోదు చేసిన అప్పటి తిరుమల రెండోవ పట్టణ పోలీసు అధికారి సీఐ చంద్రశేఖర్‌ను విచారించారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, సీసీ కెమెరాలు దృశ్యాలను పరిశీలించారు. పరకామణి పరిశీలించిన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పోలీసు అతిథి గృహంలో టీటీడీ భద్రతాధికారులతో భేటీ అయి అక్కడ విచారణ చేపట్టారు.
2023 సంవత్సరం మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 920 డాలర్లను చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డారు. అనంతరం కేసు విచారణలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు ఎదురయ్యాయి. లోక్‌అదాలత్‌లో రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రవికుమార్ విరాళంగా ఇచ్చారు. ఈ వరస పరిణామాల నెలకొన్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ మొదలుపెట్టింది.
పరకామణి కేసుకు సంబంధించి వన్ టౌన్ పీఎస్‌లో ఉన్న సిడి ఫైల్స్ ,ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, లోక్ అదాలత్ ఆర్డర్ సిఐడి బృందం సీజ్ చేసింది. పరకామణి భవనాన్ని, సిసిటివి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఐడీ బృందం పరిశీలించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారంలో పలుకోణాల్లో విచారించి రికార్డ్లను సిఐడి సీజ్ చేసింది.



