Telangana politics: వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని శాసన సభ నిర్ణయించడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయా? సీబీఐ రంగంలోకి దిగితే కేసీఆర్ జైలుకెళ్తారా? కేసీఆర్ జైలుకెళ్తే బీఆర్ఎస్ మనుగడ సాధించగలదా? అసలు కేసీఆర్ ను సీఎం రేవంత్ జైలుకు పంపిస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ వైఖరి ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాళేశ్వరం అంశాన్ని కాంగ్రెస్ తెరమీదకు తెచ్చిందా? కాళేశ్వరం కథ
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని శాసనసభ నిర్ణయించడంతో తెలంగాణ శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సీబీ ఐ రంగంలోకి దిగితే బీఆర్ ఎస్ భవితవ్యం ఏంటని ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మథనపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశాన్ని ఓ అస్త్రంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఇష్యూ గులాబీ గుండెల్లో గుబులు రేపుతోంది.
14,500 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అంచనాను 25 వేల కోట్లకు అంటే సుమారు 200 శాతానికి కేసీఆర్, హరీశ్ రావు పెంచేసి నిధులు కాజేశారని రేవంత్ సర్కార్ నిన్నటి అసెంబ్లీలో ఆరోపించింది. సీబీఐ రంగంలోకి దిగితే ఈ నిధులన్నీ ఏ మూలకు చేరాయి అన్నది తేల్చవలసి ఉంది. కాళేశ్వరం అవినీతిని సీబీఐ నిగ్గు తేల్చితే అందుకు బాధ్యులైన కేసీఆర్ తోపాటు హరీశ్ రావు, నిధులు దిగమింగిన మరికొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు జైలుకెళ్లే అవకాశం ఉంది.
కాళేశ్వరం అవినీతిపై విచారించేందుకు సీబీ ఐ రంగంలోకి దిగితే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకరిస్తుందా అన్న సందేహం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న కేసీ ఆర్ కుమార్తె కవితినే బీజేపీ ఏం చేయలేనప్పుడు కేసీఆర్ ను ఎం చేయగలదన్న సందేహం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. కేసీఆర్ పై చర్యలు తీసుకోవట్లేదని నిన్నటి అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరోక్షంగా చెప్పారు.
కాళేశ్వరంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో హరీశ్ రావు అర్థం లేని ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. నిజంగా కేసీఆర్ పై చర్యలు తీసుకొని ఉంటే మేడిగెడ్డ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగుబాటుపై విచారించే సమయంలోనే తీసుకుని ఉండేవాళ్లమని నిన్నటి అసెంబ్లీలో ఆయన తెలియజేశారు.
ప్రాజెక్టు పేరుతో బీఆర్ ఎస్ సర్కార్ చేసిన తప్పును తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత తమకు ఉన్నందున చర్చ కొనసాగిస్తున్నట్టు భట్టి చెప్పారు. మరోపక్కకేసీఆర్ పై చర్యలు తీసుకోవల్సిందేనని పొంగులేటి వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటపెట్టకపోతే ప్రజల దగ్గర చులకనైపోతామని ఆయన వాదిస్తున్నారు.
కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావించకపోయినాకేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించకపోయినా ఓట్ల కోసం జనం మధ్యకు వెళ్లలేమని పొంగులేటితోపాటు మరో మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా బీజేపీని కూడా ఇరుకున పెట్టడానికి కాళేశ్వరం కథను సీబీఐకి అప్పగించినట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్ వేసిన ఎత్తులతో బీజేపీ బిత్తరపోతుంది. బీజేపీ కోర్టులోకి కాళేశ్వరం బంతిని రేవంత్ తన్నడంతో తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా నివ్వెరపోతున్నాయి. తన చేతికి మట్టి అంటించుకోకుండా ఉండడానికి రేవంత్ వేసిన గేమ్ ఛేంజర్ గా రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని బీజేపీ ఆక్షేపిస్తోంది.
కాళేశ్వరం అవినీతిపై రుజువులన్నీ సీబీ ఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామన్న కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం విషయంలో ఎందుకు కాలయాపన చేస్తోందని బీజేపీ ఇప్పటికే ప్రశ్నిస్తోంది. ఏదిఏమైనప్పటికీ కాళే స్వరం ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎత్తుగడగానే కనిపిస్తోందని బీజేపీతోపాటు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.



