Telangana: తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్ష సూచన

Telangana: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.
దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని గంటకు 40 నుండి 50 కిలోమీ టర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది.
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టతోపాటు సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.