తెలంగాణ
ప్రేమించలేదని విద్యార్థినిపై చెప్పుతో దాడి..!

సూర్యాపేట జిల్లాలోని మునగాల మోడల్ స్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గిరిజన విద్యార్థినిని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో మధ్యాహ్నం భోజన సమయంలో పాఠశాల ఆవరణలోనే అందరూ చూస్తుండగా చెప్పుతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల ప్రిన్సిపల్ వీరబాబు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థినిపై దాడి జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.



