సినిమా

Youtuber Anvesh Case: అన్వేష్ కోసం పంజాగుట్ట పోలీసుల వేట

Youtuber Anvesh Case: చేతిలో ఫోన్ ఉంది అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో తాజా ఉదాహరణ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. ఫాలోవర్స్ ఉన్నారు అనేది బలం అనుకున్నాడు. అదే ఫాలోవర్స్ ఒక్కసారిగా భారం అవుతారనే నిజం ఆలస్యంగా అర్థమైంది. స్టేజ్ పై మాట్లాడేవాళ్లు ఆచితూచి మాట్లాడుతారు. కానీ కెమెరా ముందు ఉన్నానని కట్టడి వదిలితే సమస్య మొదలవుతుంది.

నా అన్వేషణ చానెల్స్‌తో ప్రపంచ యాత్రికుడు, ఆటగాడిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు అన్వేష్‌ ప్రపంచ దేశాలు తిరిగాడు. అక్కడి ఆహారం, సంస్కృతి చూపించాడు. ఆ ప్రయాణం అతడికి గుర్తింపు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకంగా మాట్లాడిన దశలో అతడికి అభిమానులు విపరీతంగా పెరిగారు. అదే సమయంలో అతడు ఒక స్థాయికి చేరాడు.

కానీ స్థాయి పెరిగినప్పుడు మాటల బరువూ పెరుగుతుందనే విషయం గమనించలేదు. ఈ క్రమంలోనే చిక్కుల్లో పడేసింది. యాక్టర్ శివాజీ వ్యాఖ్యలతో పాటు, ప్రవచనకర్తల వ్యాఖ్యల గురించి స్పందిస్తూ అన్వేష్‌ తన నోటికి పని చెప్పాడు. అసభ్య పదాలు వాడాడు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతల ప్రస్తావన తెచ్చాడు.

రామాయణం, మహాభారతం పాత్రలు, హిందూ దేవతలు, మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని వెంటనే భారత్‌కు రప్పించి శిక్షించాలని కోరుతున్నాయి. అదే సమయంలో అతన్ని అన్‌ఫాలో కొడుతూ నెట్టింట మినీ ఉద్యమమే నడిపిస్తున్నారు. దీంతో సబ్‌స్రైబర్ల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది తన మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వీడియో విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది.

వివాదం ముదిరాక అన్వేష్ సారీ చెప్పాడు. కానీ ఆ క్షమాపణ కూడా వ్యంగ్యంగా మారింది. మాటల్లో ఆవేశం తగ్గలేదు. వినాయకుడి సన్నిధానంలో క్షమాపణలు అన్నాడు. అదే సమయంలో శాపనార్థాలు కూడా మాట్లాడాడు. దీంతో సమస్య తగ్గలేదు. గరికపాటి పీఆర్ టీమ్ లీగల్ చర్యల హెచ్చరిక ఇచ్చింది. ఇతనిపై సినీనటి, బీజేపీ నేత అయిన కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్‌ ప్రచారం చేశారని పేర్కొనడంతో అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ముందు అతని అకౌంట్లకు వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ మేరకు అన్వేష్‌ యూజర్‌ ఐడీ వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారు. ఇప్పటికే అన్వేష్‌పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అసభ్యంగా వీడియో రిలీజ్‌ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ప్రపంచ యాత్రికుడిగా ఉండేది చెప్పాలి. అది నా వృత్తి ధర్మం. నేను హిందువుగా పుట్టా. హిందువుగా చస్తా. కానీ కొంతమంది నా మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూ మతం నుంచి వెలివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో వారికి, ఆ దేవుడికే తెలియాలి. 2026 అనేది నాకు చాలా విలువైంది. 2025 నాకు చాలా నేర్పించింది.

గాయమైనప్పుడు మందేసి నయం చేసుకోవాలి కానీ గాయం చేసిన బాణాల గురించి ఆలోచించకూడదని తెలిసింది. డబ్బు, ఫాలోవర్లు, ప్రమోషన్లు, సబ్‌స్రైబర్లు నాకు అవసరం లేదు. న్యాయం, ధర్మంతో ముందుకెళ్తా 2026లో మీ నోటితోనే శెభాష్ అనిపించుకుంటా. 18 గంటలు పనిచేస్తా లేకపోతే చెప్పు తీసుకుని కొట్టండి. రేపటి నుంచి రామాయణం ప్రారంభిస్తున్నా.” అంటూ అన్వేష్ చెప్పుకొచ్చారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన అన్వేశ్‌ ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డు కుమారుడు. కష్టపడి తెలుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేసిన అన్వేష్‌ అనంతరం యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ట్రావెల్‌ వ్లాగర్‌గా మారి కొత్త కొత్త ప్రదేశాల విశేషాలు పంచుకుంటూ ఉన్నాడు. మంచి స్పందన రావడంతో ప్రపంచ యాత్రలు మొదలుపెట్టాడు.

వివిధ దేశాల్లో తిరుగుతూ ఆ విషయాలను పంచుకుంటూ ఉంటాడు. తన పేరు వచ్చేలా యూట్యూబ్‌లో ‘నా అన్వేషణ’ అంటూ 2 ఆగస్టు 2019లో ఛానల్‌ ప్రారంభించాడు. అప్పటి నుంచి అతడికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానంతో అతడు ఉత్సాహంతో ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. ఇప్పటివరకు అన్వేష్‌ దాదాపు 90 దేశాలు తిరిగాడు.

అన్వేష్ ప్రయాణం చూసినవారికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఉన్నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే పతనం ఖాయం. విదేశీ ఉద్యోగం వదిలి యూట్యూబ్‌లో స్థిరపడ్డాడు. ఖండాంతరాలు దాటి కంటెంట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ వద్దు అని మరో మెట్టు ఎక్కాడు. కానీ కోపం, ఆవేశం, మాటల నియంత్రణ విషయంలో విఫలమయ్యాడు. స్థాయి పెరిగే కొద్దీ సహనం పెరగాలి. విమర్శను భరించే శక్తి రావాలి. అది లేకపోతే మనం మొదలుపెట్టిన చోటికే తిరిగి పడిపోతాం. అన్వేష్ పరిస్థితి అదే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button