ఈ నెల 15న సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు సత్తుపల్లి 6వ అదనపు జడ్జి ఎమ్. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరస్పర సమ్మతితో పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందన్నారు.
కోర్టు ప్రక్రియలకు వెచ్చించే సమయం, ఖర్చులు తగ్గడానికి కూడా ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. లోక్ అదాలత్‌లో సివిల్ వివాదాలు, కుటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కేసులు, బ్యాంకింగ్–ఫైనాన్స్‌కు సంబంధించిన లిటిగేషన్, చిన్నపాటి క్రిమినల్ కేసులు వంటి ఎన్నో కేసులను పరిష్కరించే అవకాశం ఉందన్నారు. వివాదాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.



