జమ్ముకాశ్మీర్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

జమ్మూకాశ్మీర్ నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్ జరిగింది.
భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
ఇటీవల హర్యానా, జమ్మూకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా తీస్తుండగా బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మృతదేహాలను తరలించారు. 24 మంది పోలీసులు, నలుగురు పౌరులు శ్రీనగర్‌లోని పలు పోలీస్స్టేషన్లలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటుచేసుకోవడంతో రెస్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.



