జగన్ ఓటమే సునీతా లక్ష్యమా?

Sunitha: ఎన్నికలు వస్తేనే సునీతకు వైఎస్ వివేకా హత్య గుర్తుకు వస్తుందా వివేకా హత్యను రాజకీయాల కోసం ఆమె వాడుకుంటుందా తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే సునీత లక్ష్యమా టీడీపీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం సునీత పని చేస్తున్నారా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే ఆమె వ్యూహమా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సమయంలో వివేక హత్య వివాదాన్ని సునీత వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారా అంటే అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు.
వైఎస్ వివేకా హత్య 2019 మార్చి పదిహేనో తేదీన ఆయన నివాసం లో జరిగింది. హత్య జరిగి దాదాపు అరేళ్లు గడుస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతుంది. 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య వెనుక తెలుగుదేశం పార్టీ ఉందంటూ అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో వివేకా హత్య ప్రధాన రాజకీయ అస్త్రంగా వైసిపి ప్రచారం చేస్తే దానినీ దీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది టిడిపి. అయితే వైసీపీ ప్రచారానికి ప్రజలు మద్దతు పలికారు.ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం తో ఈ హత్య వెనుక ఎవరున్నారు.
దానికి కారకులెవరో బయట పడతారని అంతా భావించారు. అయితే వివేకా కేసులో కదలిక లేదంటూ ఆయన కుమార్తె cbi విచారణ కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అందుకు అప్పటి వైసిపి ప్రభుత్వం కూడా సమ్మతి తెలిపింది. వివేకా హత్య కేసు ఆయన కుమార్తె కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి సీబీఐ చేతికి విచారణకు వెళ్లింది. సీబీఐ విచారణలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. కేసు విచారణ అటు తిరిగి ఇటు తిరిగి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబానికి చుట్టుకుంది.
సీబీఐ విచారణ మొత్తం అవినాష కుటుంబం చుట్టూ తిరగడంతో వివేకా కుమార్తె సునీత కూడా వైసీపీ కి, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తిరుగుబాటు చేసింది. దీంతో వైసిపి అధినేత జగన్, సునీతకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. సునీత నేరుగా అన్న జగన్,అవినాష్ నీ టార్గెట్ చేయడం దీనికి టిడిపి మద్దతుగా గొంతు కలపడం తో రాష్ట్రంలో అదో పెద్ద సంచలనంగా మారింది. సునీతకు తోడు షర్మిల కూడా వివేకా హత్య పై ఆమెకి మద్దతుగా గా జగన్నే టార్గెట్ చేయడం తో ఇంటి పోరు రచ్చకెక్కింది.
2019 ఎన్నికల్లో వివేకా హత్య కేసు నీ వైసిపి ప్రధాన ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తే 2024 ఎన్నికల నాటికి అదే అస్త్రం వైసిపి వైపు టీడీపీ ఎక్కుపెట్టింది.దీనికి షర్మిల,సునీత కూడా భుజం కాయడం తో ఆ అస్త్రం గట్టిగానే జగన్ మోహన్ రెడ్డికి గుచ్చుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సునీత ఊరు వాడ ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని బహిరంగంగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం లో సునీత ,షర్మిల పెద్ద ఎత్తున వైసిపి పార్టీకి నష్టం కలిగేలా ప్రచారం చేసారు. అయినా జగన్ పెద్దగా వారిని ఏమి అనలేక పొయ్యారు. గట్టిగా మాట్లాడదాము అంటే ఇద్దరు సొంత చెల్లెలు అయిపోయారు. పోనీ ఊరుకుందామా అంటే రాజకీయంగా నష్టం చేస్తున్నారు. అయినా సరే జగన్ సునీత విషయంలో పెద్దగా స్పందించలేదు.
తండ్రి హత్యతో బాధలో ఉన్న సునీత తెలిసో తెలియకో ఏదో మాట్లాడుతున్నారని చూసి చూడనట్లు వ్యవహరించారు. చివరకు జగన్ పై సునీత,షర్మిల చేసిన రాజకీయ ప్రచారం టీడీపీ కూటమికి కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప లో కేవలం మూడు ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కావాలి వచ్చింది. 2014లో పది స్థానాల్లో తొమ్మిది, 2019 లో పదికి పది స్తనాలు గెలిచిన వైసిపి 2024 ఎన్నికల్లో తేలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ఎన్నికల్లో సునీత,షర్మిలకు వివేకా హత్య అంశాన్ని రాజకీయంగా వైసిపి పై రుద్దడమే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా పులివెందుల నియోజక వర్గం పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక సమరం మొదలయింది. జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం హేమ్వహిస్తున్నారు.దీంతో టీడీపీ,వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక నువ్వా నేనా అన్నట్లు అధికార టీడీపీ, వైసిపి తల పడుతుంటే సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చారు వివేకా కుమార్తె సునీత. తాజాగా వివేకా హత్య కేసు విచారణ పూర్తి అయిందని సుప్రీంకోర్ట్ కి సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్య కేసు పై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోర్టు మెట్లు ఎక్కి మరి తన పంతం నెగ్గించుకున్న సునీత సీబీఐ విచారణ పై సంతృప్తిగా లేనట్లు తెలుస్తుంది.
ఓ వైపు సీబీఐ విచారణ పూర్తి అయింది అని చెబుతుంటే మరోవైపు సునీత ycp టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.వివేకా కేసులో తమకు న్యాయం జరగలేదని సునీత వాదిస్తుంది. పులివెందుల లో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వివేకా హత్య గుర్తుకు వస్తుంది అని సునీత అన్నారు.గొడ్డలి పోటు తో వివేకా పడి ఉంటే గుండె పోటు అన్నారని గుర్తు చేస్తున్నారు. తాజాగా సునీత వ్యాఖ్యలు మళ్ళీ టీడీపీ కూటమికి అస్త్రంగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ,సునీత దంపతుల తో సమావేశం అయ్యారు.వారి పోరాటానికి ఆయన మద్దతు పలికారు. ఈ పరిణామాల న్నీ వైసిపి నీ మరోసారి ఇబ్బంది పెట్టడానికే అనే చర్చ జరుగుతుంది.
మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తును పునఃప్రారంభించాలని ఆయన కుమార్తె సునీత కోరారు. ఈ మేరకు చట్టసభల ప్రతినిధులకు ఆమె లేఖ రాశారు. తన తండ్రి మృతి సమాచారం బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్‌కు తెలుసని సునీత ఆరోపించారు. తెలంగాణ హైకోర్టుకు ఈ విషయాన్ని సీబీఐ చెప్పిందని లేఖలో గుర్తుచేశారు. కానీ ఆ కోణంలో విచారణ చేయకుండా దర్యాప్తును అర్ధాంతరంగా నిలిపివేసిందని సునీత వాపోయారు.
హత్య జరిగి ఆరేళ్లు దాటిపోయిందని ఆమె పేర్కొన్నారు. వివేకా కుమార్తె న్యాయం కోసం పోరాడుతుంటే తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే న్యాయం కోసం ప్రజాప్రతినిధులను అభ్యర్థిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. తాజాగా సునీత చేస్తున వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుతున్నపుడు మాత్రమే సునీతకు వివేకా హత్య గుర్తుకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. గత పద్నాలుగు నెలలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఇప్పటి వరకు వివేకా హత్య విషయం ఎందుకు గుర్తుకు రాలేదని సునీత పై ఫైర్ అవుతున్నారు.
పులివెందుల జెడ్పీటీసీకి ఎన్నికలు జరుగుతుందనే సునీతను టీడీపీ రంగంలోకి దింపింది అని ఆరోపిస్తున్నారు. ఎలాగైనా టీడీపీ ఈ ఎన్నికలో గెలవాలని ఓ వైపు దాడులు చేస్తూ వైసిపి నేతలను ఇబ్బంది పెడుతుంటే మరోవైపు సునీత వారికి ఊతం ఇచ్చేలా వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని మండి పడుతున్నారు. అటు టీడీపీ,ఇటు సునీత చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని వారికి పరాభవం తప్పదని వైసీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మీద సునీత ఇలా ప్రతి ఎన్నికల్లో జగన్ కి కంట్లో నలుసులా మారడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.



