తెలంగాణ

యూరియా కష్టాలు.. రైతన్నలకు తప్పని తిప్పలు

యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండితిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా, మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చునా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయడం లో నిరక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు ఎక్కువ ధరకు యూరియా ను ఇవ్వడంతో పాటు పురుగు మందులను అంటగట్టడం జరుగుతుందని రైతులు మండిపడుతున్నారు. రైతులకు సరిపడ యూరియా ను సరఫరా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.

వర్ధన్నపేటలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పర్వతగిరి మండలం కల్లెడ పీఏసీఎస్ సొసైటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోనూ సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు క్యూలు కట్టిన దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి.

యూరియా కొరత రైతుల ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద రాయపర్తిలో పర్యటించారు. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటున్న షాపులవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సత్యశారద.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button