సినిమా

Vishal: విశాల్‌కు ఏమైంది..? గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో

Vishal: విశాల్‌కు ఏమైంది..? సిక్స్ ప్యాక్స్‌తో ఫిట్‌గా ఉండే విశాల్ వణికిపోతున్నాడు… బ‌క్క‌చిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు… మైక్‌ను పట్టుకోవడానికీ ఇబ్బందులు పడ్డాడు. వైరల్ ఫీవర్ వస్తే ఇంతలా డీలాపడిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతుచిక్కని వ్యాధి విశాల్‌ను బాధపెడుతోందా… అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

విభిన్న‌మైన పాత్ర‌లు పోషించే అతికొంత మంది న‌టుల్లో విశాల్ ఒక‌రు. పందెం కోడి, పూజ‌, అభిమ‌న్యుడు, సెల్యూట్ వంటి సినిమాలు తీసి.. అటు కోలీవుడ్‌తో పాటు, ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. చివ‌ర‌గా గ‌తేడాది రత్నం అనే మూవీతో కనిపించాడు విశాల్. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విశాల్ మ‌దగ‌ద‌రాజా సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశాల్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు.

విశాల్ చెన్నైలో ఉన్నాడు.. తమిళ్ సినిమాలు చేస్తున్నాడని తమిళ్ తంబీ అనుకోవద్దు. విశాల్ అచ్చతెలుగు అబ్బాయి. వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విశాల్ అక్కడే తన కెరీర్‌ను మొదలుపెట్టి తమిళ్ హీరోగా మారాడు. ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. అతనిని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పందెం కోడి. ఈ సినిమా తరువాత విశాల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇక ప్రస్తుత సినిమా విషయానికొస్తే.. మదగదరాజా ఫిల్మ్‌ను 2012 లోనే కంప్లీట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఇంతకాలం రిలీజ్ ఆగిపోయింది. 12 ఏళ్ల త‌ర్వాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు విశాల్ కూడా హాజ‌రయ్యారు. ఐతే, విశాల్ బాగా బ‌క్క‌చిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. స్టేజీపై మాట్లాడుతున్న స‌మ‌యంలో చేతులు కూడా వణుకుతూ క‌నిపించింది. క‌నీసం మైక్‌ను కూడా గ‌ట్టిగా ప‌ట్టుకోలేక‌పోతున్నాడు. అంతేకాదు.. మాట్లాడుతున్నపుడు నోట్లో నుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు.

మదగదరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశాల్‌ను చూసిన వారంతా షాక్ అయ్యారు. విశాల్ ఎప్పుడూ ఫిట్‌గా ఉండి, స్టేజ్ మీద ఎంతో ఉల్లాసంగా కనిపించేవాడు. కానీ తన మదగజరాజ ఈవెంట్‌లో భాగంగా విశాల్ కనిపించిన తీరుకు అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. విశాల్ లుక్ మొత్తం మారిపోయింది. కనీసం నిల్చోలేకపోయాడు. చేతులు కూడా వణుకుతూనే ఉన్నాయి. విశాల్ ఏదైనా వింత వ్యాధితో బాధపడుతున్నాడా? అని అంతా అనుకుంటున్నారు.

విశాల్ బ్రెయిన్‌లో ఉన్న నరాలు డ్యామేజ్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రెయిన్‌లో నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల విశాల్ చిన్న విషయానికే ఎక్కువ ఒత్తిడికి గురవడం, విపరీతమైన తలనొప్పి వంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారట. దీనికి సంబంధించి విశాల్ ఫారిన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన అనీషా రెడ్డితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. అనీషా రెడ్డితో విశాల్‌కి ఎంగేజ్‌మెంట్ అయ్యింది.పెళ్లికి పది రోజులు ఉండగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్. తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల తాను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విశాల్ ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే గత కొన్ని రోజులుగా విశాల్ జ్వరంతో ఉన్నాడని అతని టీం చెప్తోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని చెప్తున్నారు. ఇక అభిమానుల భయాందోళనలను గమనించిన అపోలో వైద్యులు.. విశాల్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు. విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాల్ కు బెడ్ రెస్ట్ కావాలని చెప్పుకొచ్చారు. విశాల్‌కు చికిత్స అందిస్తున్నామని.. ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రకటన విడుదల చేశారు.

తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్‌ ఈవెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్‌కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంత చిక్కిపోతారా? విశాల్‌ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button