Rains: అన్నదాతను నిండాముంచిన అకాల వర్షాలు

Rains: అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం గింజల్ని నీటిపాలు చేశాయి. ఇంటిల్లిపాది రెక్కల కష్టం వర్షార్పణమైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తన కళ్లెదుటే నీటిపాలైన తీరుని చూసి రైతన్నలు కంటతడి పెడుతున్నారు.
30 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న, మిర్చి, టమాట కూరగాయల పంటలు నేలకొరిగాయాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యం అంటున్నారు సిద్ధిపేట జిల్లా రైతులు.
సిద్ధిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను నిండాముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో పూర్తిగా నేలపాలైంది. అకాలంగా కురిసిన వడగండ్ల వానకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. చిన్నకోడూరు మండలంలో రాముని పట్ల, ఇబ్రహీం నగర్, గోనెపల్లి కస్తూరి పల్లి వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా దెబ్బ తినడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జిల్లాలో ముఖ్యంగా మద్దూరు, ఇబ్రహీం నగర్, సిద్దిపేట అర్బన్ , చిన్నకోడూరు, చేర్యాల మండలాలలో వడగల వర్షం దంచికొట్టింది. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ కన్నీరుపెట్టుకున్నారు రైతన్నలు. వ్యవసాయ దారుల చేత పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించి నష్టపరిహారం తొందరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కరెంటు కష్టాలతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి పంటలు పండిస్తే చివరికి వడగండ్ల వానతో వాళ్ళ ఆశలు ఆవిరయ్యాయి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ అధికారుల చేత సర్వే చేయించి ప్రతి ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన సమయానికి అకాల వర్షం ఆగం చేసింది. కరుణించాల్సిన వరుణుడే కన్నెర్ర చేయడంతో కష్టాల ఊబిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. అకాల వర్షానికి రోడ్ల పై ఆరబోసుకున్న వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. మరికొన్నిచోట్ల కుప్పలలో పూర్తిగా నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట పూర్తిగా తడిచిన పోవడంతో రైతన్నలు బోరున విలపిస్తున్నారు.



