నేటి నుంచే బతుకమ్మ సంబురాలు.. తెలంగాణలో పండుగ సందడి షురూ..!

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలకు వేళైంది. ఊరూరా రంగురంగుల పూల సింగిడి పరుచుకోనుంది. ఇవాళ్టి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే సంబురాలు తొమ్మిది రోజులపాటు అంబరాన్ని అంటనున్నాయి. ఇక సద్దుల బతుకమ్మ దాకా చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడబిడ్డలంతా బతుకమ్మలను పేర్చి, ఆటపాటల్లో మునిగితేలుతారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వాడలన్నింటినీ ఆటాపాటలతో హోరెత్తిస్తారు.
ప్రభుత్వం సైతం ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాల అలంకరణతోపాటు చెరువులు, ఘాట్ల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి రూ.10 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
అదేవిధంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులను అధికారులు ముమ్మరం చేశారు. పల్లెల్లో చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ఘాట్ల ఏర్పాటుతోపాటు రహదారుల మరమ్మతులు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఘాట్ల చుట్టుపక్కల ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, విద్యుత్ దీపాలను అమర్చడం, ఘాట్ల వద్ద ప్రజల రక్షణ కోసం బారికేడ్లు, మెట్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి వేలాది మంది ఆడపడుచులతో భారీ బతుకమ్మ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహిస్తారు. తర్వాత బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ప్లాట్‌ఫారాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.



