ఆంధ్ర ప్రదేశ్

Gadde Rammohan: ఏ ఎన్నికల్లోనైనా బెజవాడ తూర్పులో సైకిల్ హ‍ావా

Gadde Rammohan: ఒక్క నియోజకవర్గం… మూడు ఎన్నికలు.. ముగ్గురు అభ్యర్థులు మారారు….అయినా ఫలితం మాత్రం మారలేదు… ఆ పార్టీకి కలిసి రాలేదు కూడా..ఈసారి అయినా గెలుపు వస్తుందో లేదో కూడా తెలియదు.. రాజకీయ చైతన్యానికి మారు పేరు.. అందులోనూ ఆ నియోజకవర్గం టీడీపీ అడ్డా.. అక్కడ గత మూడు ఎన్నికల్లో సైకిల్ పార్టీదే హవా…..ఇంతకు ఆ నియోజక వర్గం ఎక్కడ ఉంది. అక్కడ ఒక్కసారైనా గెలవాలని వైసీపీ ఆరాటపడుతోంది..సైకిల్ పార్టీకి పోటీ ఇస్తా అంటున్న నాయకుడెవరు.. ఎమ్మెల్యేగా గెలిచి అధినేతకు గిఫ్ట్ ఇస్తానంటున్న యువనేత ధీమా ఏంటి..?

ఏపీ రాజకీయాల్లో గత మూడు ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ కూటమి, 2019లో వైసీపీ, 2024 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ కూటమి అధికారం దక్కించుకున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ నియోజకవర్గంలో మాత్రం గెలుపు టీడీపీదే. బెజవాడలో మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి బెజవాడ తూర్పునియోజక వర్గం. ఆ నియోజక వర్గం నుంచి వరుసగా మూడు సార్లు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయం సాధిస్తున్నారు. అది కూడా వైసీపీ అభ్యర్థుల పైనే.

2019 ఎన్నికల్లో వైసీపీ సునామీలో కూడా ఇక్కడ టీడీపీనే విజయం వరించింది. అంతలా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా పాతింది. టీడీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్న ఓ బలమైన సామాజిక వర్గం ఓటర్లు అత్యధిక సంఖ్యలో బెజవాడ తూర్పు నియోజక వర్గంలో ఉండటం కూడా సైకిల్ పార్టీ ఎమ్మెల్యేకి కలిసి వస్తుంది.

2014 నుంచి 2024 వరకు టీడీపీతో వైసీపీ మూడుసార్లు తలపడింది. మూడు ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చి ప్రయోగం చేసింది వైసీపీ. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రంగా తనయుడుగా, మాజీ ఎమ్మెల్యేగా బెజవాడ రాజకీయాల్లో పేరు పొందిన రాధానే సరైన అభ్యర్థి అని వైసీపీ భావించింది. కానీ ఆ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఫ్యాన్ పార్టీపై విజయం సాధించారు.

2019 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు మారాయి. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.. దీంతో ఆ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికే చెందిన బొప్పన భవ కుమార్‌ను ఎన్నికల బరిలో నిలిపింది వైసీపీ. అయినా ఫలితం మాత్రం మారలేదు.

మళ్ళీ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. 2019 నుంచి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఆ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కృష్ణ లంక ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న కృష్ణ వరదల సమస్యకు పరిష్కారం చూపింది. అన్నిటింకి మించి విజయవాడ రాజకీయాల్లో మంచి పట్టున్న మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌ను జగన్ గత ఎన్నికల బరిలో నిలిపారు.

ఒకవైపు దేవినేని అవినాష్‌కి సొంత సామాజిక వర్గం, మరోవైపు నెహ్రూ అనుచరగణం పెద్ద ఎత్తున కలిసి వచ్చే అవకాశాలు అని అంతా భావించారు. అయినా టీడీపీ కూటమి సునామిలో ముచ్చటగా మూడోసారి ఫ్యాన్ పార్టీకి నిరాశ తప్పలేదు.

గత ఎన్నికల్లో టీడీపీ చేతిలో దేవినేని అవినాష్ ఓడిపోయారు. ఒకసారి వైసీపీ నుంచి విజయవాడ తూర్పులో పోటీ చేసిన అభ్యర్థి రెండోసారి మళ్ళీ పోటీ చేయలేదు. కానీ దేవినేని అవినాష్ మాత్రం అలా కాదు. గత ఎన్నికల్లో వచ్చిన ఓటమికి నిరాశ చెందకుండా తిరిగి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

ప్రతి ఇంటి గడప తడుతున్నారు. వైసీపీ హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గ ప్రజలకు వివరిస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో పట్టు కోసం పని చేస్తూనే ఇంకో వైపు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని ఎన్టీఆర్ జిల్లాలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెస్తామంటున్నారు. ఇది అంతా బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో అయినా విజయవాడ తూర్పు నియోజక వర్గంలో వైసీపీ విజయం సాధిస్తుందా…అంటే ఇప్పుడు చెప్పలేమని అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. అయితే దేవినేని అవినాష్ మాత్రం ఈ సారి సొంత సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ఇతర సామాజిక వర్గాల అండ తనకే దక్కుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాలని పట్టుదలగా పని చేస్తున్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. దీంతో సహజంగానే ఆయన పై కొంత వ్యతిరేకత వచ్చే ఛాన్స్ వుంటుంది. దీనికి తోడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కలిసి వస్తాయని అవినాష్ వర్గీయులు చెబుతున్నారు.

ఇలా అన్ని అవకాశాలు కలిసి వస్తే అవినాష్ గెలుపు ఖాయమని జగన్‌కి మొదటి గిఫ్ట్ ఇక్కడ నుంచే అంటున్నారు అవినాష్ వర్గీయులు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటికి రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఇప్పుడు అంచనా వేయడం అసాధ్యం. కాబట్టి రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందో వైసీపీ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button