YS Jagan: అక్రమాస్తుల కేసులో రేపు సీబీఐ కోర్టుకు జగన్

YS Jagan: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ ఆస్తుల కేసు విచారణ కొనసాగుతుంది. జగన్ బెయిల్ పై విడుదల అయిన తరువాత కేసుల విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం గతంలో కోర్టుకి హాజరయ్యారు . 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సమయంలో కూడా హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు లో హాజరయ్యేవారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి మాత్రమే కోర్టుకి హాజరయ్యారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ 2020 జనవరి 10 న ఒకసారి కోర్టుకి వచ్చారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత మళ్ళీ జగన్ విచారణకు హాజరు కావాలంటూ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారని…ఇది కోర్ట్ షరతులను ఉల్లగించడమే అంటూ సీబీఐ పిటిషన్ వేసింది.అంతే కాదు జగన్ విచారణకు కోర్టు ముందు హాజరు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
అయితే సిబిఐ పిటిషన్ కి కౌంటర్ గా కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు కావాలని,అలా కుదరని పక్షంలో వర్చువల్ గా హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపద్యంలో జగన్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 20 తేదీన కోర్టు ముందు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు ఆరేళ్ల తరువాత జగన్ మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. అందులో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదకొండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా సీబీఐ కోర్ట్ కి హాజరవుతారు జగన్.
జగన్ మోహన్ రెడ్డి కోర్టుకి వెళుతున్న నేపద్యంలో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కేసుల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే టెన్షన్ నెలకొంది పార్టీ క్యాడర్లో. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి హాజరు విషయంలో సీబీఐ కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. గతంలో లాగా ప్రతి శుక్రవారం హాజరు కావాలని ఆదేశిస్తుందా లేదంటే హాజరు నుంచి మినహాయింపు విషయంలో ఊరట లభిస్తుందా అనే చర్చ జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం వైసీపీదే అనే భరోసా ఇప్పుడిప్పుడే క్యాడర్ లో నింపుతున్నారు జగన్. ఇలాంటి కీలక తరుణంలో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డికి కోర్టుల చుట్టూ తిరగడం అంటే ఆయన స్పీడ్ కి స్పీడ్ బ్రేకర్లు వేయడం వంటిదే అనే వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
ఇక సీబీఐ కేసుల విచారణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రానున్న రాజుల్లో కోర్టు తీర్పులు ఎలా ఉంటాయో అనే సందేహాలు వైసీపీ నేతలకు ఇప్పటి నుంచే మొదలు అవుతున్నాయి. అయితే అక్రమ ఆస్తుల కేసు విషయంలో జగన్ కడిగిన ముత్యంలా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు.



