రజనీకాంత్, బాలకృష్ణకు అరుదైన సన్మానం..!

IFFI 2025: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్, బాలకృష్ణలను ఇఫి 2025లో సత్కరించనున్నారు. గోవాలో జరగనున్న 56వ ఫెస్టివల్లో ఈ గౌరవం దక్కనుంది.
చలనచిత్ర రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిగ్గజ నటులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం లభించనుంది. గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి-2025) ముగింపు వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సన్మానించనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు.
50 ఏళ్ల సినీ ప్రయాణంలో వారి అద్భుత నటన, ప్రజాదరణకు గుర్తింపుగా ఈ సత్కారం అని తెలిపారు. నవంబర్ 20 నుంచి 28 వరకు ఫెస్టివల్ జరుగనుంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్’తో రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చారు. తన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. నటనతోపాటు రాజకీయ, సామాజిక సేవల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘అఖండ 2’తో బిజీగా ఉన్నారు.



