పాముకు ప్రాణం పోసిన డాక్టర్

సాధారణంగా పామును చూసినా భయపడే మనుషులు ఉంటారు. అయితే సిరిసిల్లలో ఓ వెటర్నరీ డాక్టర్ మాత్రం పాముకే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ చంద్రంపేటకు చెందిన ఓ వ్యక్తి పాములు ఆడించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని వద్ద పాము గాయపడి తీవ్ర స్థితికి చేరింది. సజ్జమీద నుంచి పడిన గడ్డపార పాముపై పడటంతో దాని పొట్ట పగిలి, ఎయిర్ బ్లాడర్, పేగులు బయటకు వచ్చాయి.
పాము కదల్లేని పరిస్థితిలో ఉండటంతో, దాన్ని సిరిసిల్ల పశువైద్యశాలకు తీసుకువెళ్లాడు. డాక్టర్ అభిలాష్ వెంటనే శస్త్రచికిత్స చేసి పొట్టలోని భాగాలను సరి చేసి, కుట్లు వేశారు. అలాగే అవసరమైన ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లు పెట్టి మూడు రోజుల పాటు తన పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం పాము పూర్తిగా కోలుకొని కదలడం ప్రారంభించింది. డాక్టర్ కృషితో ప్రాణాలు దక్కిన పామును తిరిగి అప్పగించారు. పాముక వైద్యం చేసి ప్రాణాలు కాపాడవచ్చని నిరూపించిన డాక్టర్ అభిలాష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.



