Donald Trump: సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపులో వెనక్కి తగ్గారా అంటే అవుననే తెలుస్తుంది. చైనాపై సుంకాల విషయంలో పోటాపోటీగా మరింత ముందుకువెళ్లాలని తాను భావించ డం లేదని చెబుతున్నారు పెద్దన్న. శక్తికి మించి ధరలు పెరిగితే ప్రజలు కొనడం మానేస్తారని కొత్త రాగం అందుకున్నారు. అంతేకాదు అలా జరగడం తనకు ఇష్టం లేదని చెబుతున్నారు ట్రంప్. పైగా టారిఫ్ విషయంలో తాను వెనకడుగు కూడా వేయొచ్చని సంకేతాలిచ్చారు. కాగా ఇప్పటికే ప్రస్తుతం చైనాపై 245శాతం వరకు టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్.
మరోవైపు సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియ మెలోనీ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన సాను కూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.
చెప్పాలంటే ఇటీవల ట్రంప్ అన్ని దేశాలపై పన్నులు విధించిన సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత నుంచి ఆయన వైఖరిలో కొంత మార్పు వచ్చింది. దీంతో ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలను 90 రోజులపాటు నిలిపివేశారు. తాజాగా వ్యాఖ్యలు కూడా ఈ కోణంలో చేసినవే అని భావిస్తున్నారు. పన్నుల విధింపు నాటినుంచి చైనా తమతో టచ్‌లో ఉందని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. కానీ, అవి ఎటువంటి అంశాలపై జరుగుతున్నాయి. వాటి వివరాలేంటో మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు.
ఇక తమతో 75 దేశాలు వాణిజ్య చర్చలు చేపట్టాయని శ్వేతసౌధం పేర్కొంది. ఇక చైనా కూడా ప్రతీకార సుంకాలు విధించడంతో దానికి ఎటువంటి మినహాయింపు ఇవ్వకుండా 245 శాతం వరకు పన్నులను కొనసాగించినట్లు వెల్లడించింది.
మరోవైపు చైనా విదేశాంగ ప్రతినిధి స్పందిస్తూ వాషింగ్టన్‌తో ఘర్షణ కోరుకోవడం లేదని వెల్లడించారు. అలాగని చూస్తూ కూర్చోలేమని తేల్చి చెప్పారు. ట్రంప్ తమతో గౌరవంగా వ్యవహరిస్తే చర్చలకు సిద్ధమన్నారు.