US-India: బలహీనంగా అమెరికా- భారత్ మధ్య బంధం

US-India: బలహీనంగా అమెరికా- భారత్ మధ్య బంధంభారత్-అమెరికా బంధాన్ని ట్రంప్ వీరభక్తుడొకరు విచ్ఛిన్నం చేస్తున్నాడు. తరచూ నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ ఇప్పటికే ఉన్న వివాదాలపై పెట్రోల్ చిలకరిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని నిర్మించడానికి గత అధ్యక్షులు చేసిన ప్రయత్నాలను బూడిదపాలు చేస్తున్నారు. స్వయంగా రిపబ్లికన్ మద్దతుదారులు ట్రంప్ వర్గీయులు నెత్తీనోరు బాదుకొంటున్నా ట్రంప్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఈ భక్తుడు ఆగడం లేదు. ఇంతకీ ఎవరా భక్తుడు..? అతను చేస్తున్న పనులేంటి..? ఆయన పెట్టిన చిచ్చులేంటి..?
ఒకప్పటి మంచి స్నేహితులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. అప్పుడు నువ్వు లేక నేను లేను నువ్వు అల్లం నేను బెల్లం అనుకున్న భారత్- అమెరికా మధ్య రిలేషన్ ప్రస్తుతం పాలు, ఉప్పులా మారిపోయింది. ఏ బంధమైన చెప్పుడు మాటలు వింటే బలహీనమైనమవుతుందని నిపుణులు అంటుంటారు ఇప్పుడు అదే అమెరికా విషయంలో నిజం అవుతుంది.
భారత్- అమెరికా సంబంధాలను డొనాల్డ్ ట్రంప్ ఓ వీరభక్తుడు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించాడు. తరచూ నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ ఇప్పటికే ఉన్న వివాదాల ఆజ్యంపై పెట్రోల్ పోస్తున్నాడు. గత అధ్యక్షులు నిర్మించడానికి చేసిన సహకార ప్రయత్నాలను బూడిదపాలు చేస్తున్నారు.
పబ్లికన్ పార్టీ మద్దతుదారులు, ట్రంప్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. ట్రంప్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఈ భక్తుడు ఆగడం లేదు అతడి పేరు పీటర్ నవారో. గతంలో ట్రంప్ కోసం నాలుగు నెలల జైలులో గడిపి, శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ఆయన, ట్రంప్ వాణిజ్యయుద్ధానికి వెనుక వ్యూహకర్త అనే ప్రచారం ఏర్పడింది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక, 75 ఏళ్ల ఆర్థిక నిపుణుడు పీటర్ నవారోని తన వాణిజ్య సలహాదారుగా శ్వేతసౌధంలో తీసుకువచ్చారు. అతడి నేపథ్యం తెలిసిన చాలామంది అతడి నియామకాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
1970ల్లో నవారో జాతీయవాది కాదు. అతడు ఓ డెమోక్రటిక్ సానుభూతిపరుడు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, పర్యావరణ పరిరక్షణను కోరుతూ కాలిఫోర్నియాలో ఉద్యమించారు. ఆయన హార్వర్డు విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక శాన్‌డియా మేయర్, కాంగ్రెస్ ఇలా పలు పదవులకు పోటీ చేసి ఓడిపోయారు.
యూజీఐలో ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీలో ప్రొఫెసర్‌గా చేశారు. 1990ల్లో ఆయన తన వైఖరి మెల్లగా సంప్రదాయ జాతీయవాదం వైపు మళ్లింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకించడం, అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలు వంటి అంశాల్ని సమర్థించేవారు.
2011లో డెత్ బై చైనా అనే పుస్తకం రాశారు. దానినే డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. 2016లో ట్రంప్‌నకు అల్లుడు జరేడ్ కుష్నెర్ ద్వారా పరిచయం అయ్యాడు. తొలి కార్యవర్గంలో కూడా వైట్‌హౌస్ నేషనల్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో చైనాపై వాణిజ్యయుద్ధం, కొవిడ్ సమయంలో పాలసీ, 2020 ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ హిల్స్ ఘటనలో నవారో ప్రమేయం ఉందంటారు. 2020 అల్లర్ల విషయంలో 2023లో ఆయన్ను అమెరికా కాంగ్రెస్ విచారణకు పిలిస్తే వెళ్లకపోవడంతో నాలుగు నెలల పాటు జైల్లో వేశారు. దీంతో ఆయనకు ట్రంప్ వీరభక్తుడిగా ముద్ర పడింది.
2024లో అమెరికా ఎన్నికలు ముగిసేనాటికి ట్రంప్-మస్క్‌ల మధ్య స్నేహం విపరీతంగా పెరిగిపోయింది. ఓ రకంగా టెస్లా అధినేతే షాడో ప్రెసిడెంట్ అనేవారు. కానీ, వాణిజ్యంలో నవారో సూచించే రక్షణాత్మక వైఖరి, టారిఫ్ యుద్ధం ఆయనకు నచ్చేది కాదు. టెస్లా విడిభాగాలు విదేశాల్లో తయారై అమెరికాకు వస్తే వాటిని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారని మస్క్‌ను దెప్పిపొడిచారు.
ఓ దశలో కార్ అసెంబ్లర్ అని వ్యాఖ్యానించారు. ఓసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే మస్క్-నవారో తీవ్రంగా గొడవపడ్డారన్న వార్త గుప్పుమంది. నవారో మూర్ఖుడు అంటూ మస్క్ బహిరంగానే పోస్టు పెట్టారు. ట్రంప్ నవారో పక్షాన ఉన్నట్లు అనిపించిన తర్వాత నుంచే మస్క్ మెల్లగా శ్వేతసౌధం నుంచి దూరమయ్యారు.
ఇప్పుడు ట్రంప్-మస్క్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్లుంది. ట్రంప్ కార్యవర్గంలో వారితో నవారో గొడవపడటం ఇదే తొలిసారి కాదు. 2018లో నాటి ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌తో కూడా ఓ చైనా ప్రభుత్వ కార్యాలయ భవనం లాన్‌లో బహిరంగానే గొడవ పడ్డారు. అంతేకాదు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు నరకంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు. రెండోసారి ట్రంప్ కార్యవర్గంలో సలహాదారుగా పదవి దక్కాక అల్యుమినియం దిగుమతులపై 25శాతం సుంకం వెనక నవారోనే ఉన్నారు.
ఇక భారత్‌పై ఆంక్షల విషయంలో ట్రంప్‌నకు మద్దతుగా నవారో స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ యుద్ధం ఆగితే నోబెల్ బహుమతి వస్తుందని ట్రంప్ విశ్వసిస్తుండటంతో రష్యా-ఉక్రెయిన్ పోరు ఆపాలంటే భారత్ చమురు కొనుగోళ్లు నిలిచిపోవాల్సిందేనని విచిత్రవాదన తెర పైకి తెచ్చారు. న్యూఢిల్లీతో సంబంధాలను దెబ్బతీస్తే అమెరికా రక్షణ లక్ష్యాలకు పెనుముప్పు అని నిక్కీహేలీ వంటి వారు నెత్తీనోరు బాదుకొంటున్నా ఈ నవారో ఆగడం లేదు. భారత్ కంటే ఎక్కువ చమురు చైనా, అధిక సీఎన్‌జీ ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్నా నవారో నోరు మెదపడం లేదు. రష్యా ఆంక్షల చమురును భారత్ మారు బేరానికి విక్రయించి లబ్ధి పొందుతోందని అక్కసు ప్రదర్శిస్తున్నారు.
ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50శాతానికి రెట్టింపు చేసినప్పటి నుంచి భారతదేశం-అమెరికా మధ్య సంబంధాలు దిగజారుతున్నాయని నవారో అన్నారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే ముందు వరకు భారతదేశం దాదాపుగా రష్యన్ చమురును కొనుగోలు చేయలేదని మొత్తం అవసరంలో దాదాపు ఒకశాతం కానీ ఇప్పుడు అది 35శాతానికి పెరిగిందన్నారు. ఇంతకు ముందు సైతం నవారో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల ఆయన భారత్‌పై విమర్శల దాడి చేయడం ఇది రెండోసారి. మూడురోజుల కిందట ఫైనాన్షియల్ టైమ్స్‌లో చమురు కొనుగోళ్లపై ప్రశ్నించారు.
ఇంధన అవసరాలకు రష్యా చమురు అవసరమని భారత్ చేస్తున్న వాదనలు తప్పని.. చౌకైన ముడి చమురును కొనుగోలు చేసి, రిఫైనరీల్లో ప్రాసెస్ చేసి ఆపై యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను విక్రయిస్తుందన్నారు. ఇది భారత్‌కు పూర్తిగా లాభదాయకంగా ఉందని.. అమెరికాకు భారతదేశంతో భారీ వాణిజ్య లోటు ఉందని సుంకాల విషయానికి వస్తే భారత్ రాజులాంటిదని అక్కసు వెల్లగక్కారు. భారత్ సుంకాలు అమెరికాతో పాటు కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
భారత్‌కు వస్తున్న ఆదాయం రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ద్వారానే వస్తుందని నోరుపారేసుకున్నారు. భారత్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యా ఆయుధాలను తయారు చేసి ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని అమెరికన్ పన్ను చెల్లింపుదారులు తమ ప్రభుత్వం ద్వారా ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు మరిన్ని డబ్బు, ఆయుధాలను ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
కొన్నేళ్ల తరబడి భారత్-అమెరికా నేతలు ఓర్పుతో నిర్మించిన వ్యూహత్మక బంధంపై రష్యా చమురును నవారో చిలకరిస్తున్నారు. మరి చూడాలి భారత్- అమెరికా మధ్య ఉన్న బంధం నిలబడుతుందో లేక అగ్గిలో కాలిపోతుందో.



