Shiva Jyothi: శ్రీవారి దర్శనంపై శివ జ్యోతికి జీవితకాల నిషేధం!

Shiva Jyothi: టెలివిజన్ యాంకర్ శివ జ్యోతి, ఆమె తమ్ముడు తిరుమల ప్రసాదాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టిటిడీ తీవ్ర చర్య తీసుకుంది. ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసి, శ్రీవారి దర్శనంపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయం భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
టెలివిజన్ యాంకర్ శివ జ్యోతి, ఆమె తమ్ముడు సోషల్ మీడియాలో తిరుమల ప్రసాదాలు, లడ్డూ నాణ్యతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర చర్యలు తీసుకుంది. శివ జ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసి, ఆమెకు శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశాన్ని జీవితకాలం నిషేధించింది. ఈ నిర్ణయం టిటిడీ ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో శివ జ్యోతి ఈ-దర్శనం, సర్వదర్శనం లేదా ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది.
వివాదం తీవ్రమైన నేపథ్యంలో శివ జ్యోతి సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. తమ కుటుంబం అంతా శ్రీవారి భక్తులేనని, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ టిటిడీ తన నిర్ణయాన్ని కొనసాగించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దేవస్థానం, ప్రసాదాలు లేదా ఆలయ విధానాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే నిబంధనల ప్రకారం శిక్ష విధించబడుతాయని టిటిడీ అధికారులు స్పష్టం చేశారు.



