మేకప్ మ్యాన్ కల నెరవేర్చిన రకుల్..?

Rakul Preet Singh: ప్రముఖ మేకప్ మ్యాన్ కడాలి చక్రవర్తి సొంత మేకప్ స్టూడియో ప్రారంభమైంది. పంజాగుట్టలో ఏర్పాటు చేసిన సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. రకుల్ తెలుగు సినిమాలను మిస్ అవుతున్నానని, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక హీరోయిన్లకు మేకప్ చేసిన ప్రముఖ మేకప్ మ్యాన్ కడాలి చక్రవర్తి (చక్రి) తన దీర్ఘకాల కల నెరవేర్చుకున్నారు. పంజాగుట్టలో సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ పేరుతో సొంత స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ చక్రి తన ఫస్ట్ సినిమా నుంచి దాదాపు 8 సంవత్సరాల పాటు తన అన్ని చిత్రాలకు మేకప్ చేశారని, ఆయనకు సొంత అకాడెమీ ఏర్పాటు చేయడం ఒక కల అని, అది నేడు నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు.
అలాగే తాజాగా తెలుగు సినిమాలు చేయకపోవడంతో తెలుగు పరిశ్రమను, తెలుగువారిని ఎంతో మిస్ అవుతున్నానని, తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తానని, తొలి విజయం తెలుగు సినిమానే అందించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అఖండ తాండవం టీంకి శుభాకాంక్షలు తెలిపారు.



