అంతర్జాతీయం

ట్రంప్‌తో మస్క్ కటీఫ్.. 14 శాతం క్షీణించిన టెస్లా షేరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ బంధం దారుణంగా చెడింది. ఇటీవల డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్‌ అధ్యక్షుడి పై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు ట్రంప్‌ కూడా టెస్లా అధినేతకు గట్టిగానే వార్నింగ్‌ ఇస్తున్నారు. ట్రంప్ తన వల్లనే గెలిచారంటూ ఎలాన్ మస్క్ కామెంట్ చేయగా ఆయన లేకున్నా గెలిచేవాడినంటూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలు మస్క్‌ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి.

ఈ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. దాదాపు 152 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. మస్క్‌-ట్రంప్‌ విబేధాల నేపథ్యంలో ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఏకంగా 14శాతం మేర కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 1 ట్రిలియన్‌ మార్క్‌ను కోల్పోయి 916 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి .

తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్‌ వ్యాఖ్యానించారు. అంతేనా సెక్స్‌ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో అధ్యక్షుడికి సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను అభిశంసించాలని అన్నారు. దీనిపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆయన వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. ‘‘మస్క్‌ అంత ప్రభావవంతమైన వ్యక్తి కాదు. దేశంలోని ప్రతిఒక్కరూ బలవంతంగా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసేలా ఆయన ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. దానికి నేను అంగీకరించలేదు. వెళ్లిపొమ్మని చెప్పా. అందుకే ఆయన ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button