తెలంగాణ

RTC Buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు 10 నిమిషాలకో బస్సు

RTC Buses: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో సికింద్రాబాద్‌కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్‌ ఆర్టీసీ. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సిటీ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 13 జతల రైళ్లు నడుస్తుండగా, త్వరలో మరో 12 రైళ్లు ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రద్దీని తగ్గించే లక్ష్యంతో నగరం నడిబొడ్డున చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అద్భుతంగా నిర్మించింది. 430 కోట్ల వ్యయంతో.. 9 ప్లాట్‌ఫారాలు, 19 ట్రాక్‌లతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను.. 2025 జనవరిలో ప్రారంభించారు. ఎస్కలేటర్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, కెఫెటేరియా వంటి సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా.. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పెరుగుతున్న రైళ్ల రాకపోకల దృష్టిలో పెట్టుకుని, ఇక్కడికి వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక చర్యలు చేపట్టింది. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు ఇకపై ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.

రైల్వే అధికారుల సహకారంతో రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్, మెహిదీపట్నం, బోరబండ, కోఠి, అఫ్జల్‌గంజ్ వంటి ప్రాంతాలకు నడుస్తున్న బస్సులతో పాటు, రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 4.20 గంటల నుంచి రాత్రి 10.50 గంటల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైళ్ల సమయపాలనను అనుసరించి అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని, రైల్వే అధికారులతో సమన్వయం కోసం ప్రత్యేకంగా సూపర్‌వైజర్లను నియమించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు సికింద్రాబాద్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button