షాకింగ్.. SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు!

ప్రముఖ బ్యాంకు ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలు ఓపెన్ అవుతున్నాయంటే ఇది కచ్చితంగా షాక్ కలిగించే విషయమే. sbiterminsurance.comలో టర్మ్ ఇన్సూరెన్స్ రివైవల్ గైడ్ లింక్ క్లిక్ చేస్తే నకిలీ ఐ-బొమ్మ, మూవీరూల్జ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అధికారిక వెబ్‌సైట్‌కు చెందిన sbiterminsurance.comలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అండ్ రివైవల్ గైడ్ పేజీలోని లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవుతోంది. ముఖ్యంగా iBomma plus, iBomma 1 పేరుతో కొత్తగా వచ్చిన సైట్లు మూవీరూల్జ్ వంటి పాత పైరసీ వెబ్‌సైట్లకు దారి తీస్తున్నాయి.
ఇటీవల అరెస్టైన ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేత పాత సైట్లు బ్లాక్ అయినా, నకిలీ వెర్షన్లు ఇప్పుడు ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లను దుర్వినియోగం చేసుకుంటున్నాయి. హెచ్‌డీ ప్రింట్లతో పాటు థియేటర్ ప్రింట్లను కూడా అప్‌లోడ్ చేసే మూవీరూల్జ్ వంటి సైట్లకు ఈ మార్గంలో ట్రాఫిక్ పెంచుతున్నారు. ఇలాంటి లింక్‌లు క్లిక్ చేస్తే వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.



