Great Nicobar Project: గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు లాభమేంటి?

Great Nicobar Project: గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు మరోసారి దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార, విపక్షాలు విమర్శలు-ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు దేశ భద్రతపరంగా అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పర్యాటకంగానూ, ఆర్థికంగానూ ఎంతో మేలు జరుగుతుందని అంటోంది. కానీ పర్యావరణానికి అరుదైన ఆదివాసి తెగలకు ఈ ప్రాజెక్టు ప్రమాదకరమని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇంతకీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అంటే ఏంటీ…దాని చుట్టూ రాజకీయ వివాదాలకు కారణాలేంటీ…భారత్ కు వ్యూహాత్మకంగా ఎందుకంత ముఖ్యం…గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు లక్ష్యాలేంటో ఓసారి చూద్దాం…
ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికలో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై ఓ వ్యాసం రాశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ. దీంతో ఈ ప్రాజెక్టు గురించి చర్చ ఊపందుకుంది. ఈ వ్యాసంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోనియా గాంధీ. అక్కడ నివసిస్తున్న నికోబారీస్, షోంపెన్ అనే ప్రత్యేక తెగలు ఇప్పటికే అంతరించి పోయే దశలో ఉన్నాయని ఈ ప్రాజెక్టు వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందన్నారు. ఆ తెగలు ఉన్న ప్రాంతాన్ని బయటి వ్యక్తులు ముంచెత్తుతారని అన్నారు. ఇది ఆ తెగల హక్కులను కాలరాయడమే అని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు కారణంగా దాదాపు 8.5–18 లక్షల చెట్లు తొలగించాల్సి వస్తుందన్నారు సోనియా. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిశీనలో తప్పులు ఉన్నాయని తమకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేలా ప్రభుత్వం సైంటిస్టులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఇంతపెద్ద ప్రాజెక్టుకోసం ఇది అనువైన ప్రాంతం కాదని భూకంపాలు, సునామీలు వచ్చే డిజాస్టర్ జోన్‌లో ఉందని ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును విధానపరమైన వైఫల్యంగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అండమాన్, నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిని ఒక వ్యూహాత్మక, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చడానికి రూపొందించినది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ (ICTT), ఒక గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఒక విద్యుత్ ఉత్పాదన కేంద్రం, ఒక టౌన్‌షిప్ నిర్మాణం జరగనుంది.
మూడు నుంచి నాలుగు లక్షల మంది నివాసం ఉండేలా మెగా టౌన్‌షిప్‌ను నిర్మిస్తారు. ICTTని ఎలాంటి జనసంచారం లేని, గ్రేట్ నికోబార్ దీవి కింది భాగంలో ఉన్న గలాథియా బేలో నిర్మిస్తారు. దీన్ని హాంగ్‌కాంగ్ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచించారు. ఇది శ్రీలంకలోని కొలంబో, మాలేషియాలోని పోర్టు క్లాంగ్‌కు సమాన దూరంలో ఉంటుంది.ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు 72,000 కోట్ల నుంచి 80,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ ప్రాజెక్టును భారతదేశ ఇండో-పసిఫిక్ వ్యూహంలో కీలకమైన భాగంగా భావిస్తోంది కేంద్రం.ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ చేపట్టింది. అండమాన్, నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యతను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
ఈ ప్రాజెక్ట్ భారతదేశ రక్షణ, వాణిజ్య, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఒక సమగ్ర పథకంగా రూపొందించినది.గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌ను అమలు చేసే బాధ్యత ANIIDCOకి అప్పగించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, గలాథియా బే దగ్గర ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది.
ఇది సుమారు 16 మిలియన్ ట్వంటీ-ఫీట్ ఈక్వివలెంట్ యూనిట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే, 450 MVA గ్యాస్, సౌర ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రం, ఒక గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం భారతదేశ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్ట్ వల్ల మలాక్కా జలసంధి సమీపంలో గ్రేట్ నికోబార్ దీవి భౌగోళిక స్థానంగా మారనుంది. దీన్ని ఒక ప్రధాన షిప్పింగ్ హబ్‌గా మార్చుతారు.
దీని వల్ల భారతదేశ వాణిజ్య ఖర్చులు తగ్గుతాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ASEAN దేశాలతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం వంటి ఆర్థిక లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే రక్షణ సామర్థ్యాల్ని మెరుగుపరచడం, ఇకో టూరిజం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలుగా ఉన్నాయి.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్. ఇది దశలవారీగా అమలవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు సుమారు 30 సంవత్సరాల సమయం పట్టవచ్చు. మొదటి దశలో ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇవి 2030 నాటికి కొంతవరకు పనిచేయడం ప్రారంభించవచ్చు. అయితే, మొత్తం ప్రాజెక్ట్, టౌన్‌షిప్, ఇతర సౌకర్యాలతో సహా 2050 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. పర్యావరణ అనుమతులు, ఆర్థిక సమీకరణ, ఇతర లాజిస్టికల్ అంశాల ఆధారంగా దీని నిర్మాణ వేగం ఉంటుంది.
ఇండోనేసియాలోని సుందా, లాంబోక్ జలసంధి సమీపాల్లో చైనా నావికాదళ స్థావరాలు నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అంతేకాకుండా స్ట్రింగ్ ఆప్ పెర్ల్స్ వ్యూహంలో భాగంగా భారత్‌కు తూర్పు దిక్కున శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును 99 ఏళ్లు లీజుకు తీసుకుంది చైనా. అలాగే బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్టు అభివృద్ధి చేస్తోంది. ఇక మయన్మార్‌లో క్యయుక్‌ప్యూ ప్రాంతంలో డీప్ సీ పోర్టును నిర్మిస్తోంది. దీంతోపాటు అండమాన్ నికోబార్, ద్వీపాలకు కేవలం 55 కిలోమీటర్లలోని కోకో ఐలాండ్స్‌లో మిలిటరీ స్థావరాన్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్‌కు చాలా ప్రమాదకరం.
ఈ క్రమంలో డ్రాగన్ ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. చైనా భారత్ చుట్టూ ఇన్ని పోర్టులు అభివృద్ధి చేసినా డ్రాగన్‌కు చెక్ పెట్టాలంటే నికోబార్ ఐలాండే కీలకం. ఇక్కడ భారత్ మిలిటరీ, నావల్, కోస్ట్‌గార్డ్ స్థావరాలు ఉంటే చైనా పీక నొక్కినట్టే అవుతుంది. అందుకోసమే వాణిజ్య అవసరాలకు, మిలిటరీకి అవసరమయ్యే విధంగా ఇక్కడ విమానాశ్రయం, పోర్టు నిర్మించాలని ప్రణాళిక వేశారు. చైనా వ్యూహానికి భారత్ ప్రతివ్యూహం నెక్లెస్ ఆఫ్ డైమండ్‌లో భాగంగా ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
పర్యావరణ , ఆదివాసి ఆందోళనలు
ఈ ప్రాజెక్ట్‌ను పర్యావరణవేత్తలు, స్థానిక ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రేట్ నికోబార్ దీవి అరుదైన జీవవైవిధ్యం, లెదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్ల వంటి ప్రత్యేక జాతులకు నిలయంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 130.75 చ.కి.మీ అడవులు నాశనం కావచ్చనీ, ఇది స్థానిక పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
అలాగే, షోంపెన్, నికోబరీస్ ఆదివాసీ సంఘాలకు ఈ ప్రాజెక్ట్ వల్ల సాంస్కృతిక వారసత్వం, జీవనోపాధికి ముప్పు వాటిల్లవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఈ ప్రాజెక్ట్‌ను “పర్యావరణ విపత్తు”గా విమర్శించారు.
ఇది ఆదివాసీ హక్కులను అతిక్రమిస్తుందనీ, చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ కూడా ఈ ప్రాజెక్టు ఆదివాసీ సంఘాలకు అన్యాయం చేస్తుందని అన్నారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ జాతీయ రక్షణ, ఆర్థిక అభివృద్ధికి కీలకమైనదని సమర్థించారు. పర్యావరణం, ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ భారతదేశాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఒక శక్తిమంతమైన కేంద్రంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భారతదేశ వాణిజ్య ఖర్చులు తగ్గడమే కాకుండా, ఆగ్నేయాసియాతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే, పర్యావరణ సమతుల్యత, ఆదివాసీ సంఘాల హక్కుల పరిరక్షణ కీలక సవాళ్లుగా మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ భారతదేశ “యాక్ట్ ఈస్ట్” విధానానికి అనుగుణంగా ఉంటూ, దేశాన్ని ఒక ప్రముఖ ఆర్థిక, వ్యూహాత్మక శక్తిగా నిలబెట్టే అవకాశం ఉంది.
ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సముద్ర మార్గాలున్నాయి. గల్ఫ్ నుంచి చైనా, జపాన్ వరకూ ఉంటాయి. ఆ మలక్కా జలసంధి ద్వారా వెళతాయి. ఈ జలసంధి అంతర్జాతీయ మార్గం. దీనికి అంత్యంత దగ్గరగా ఉండేదే ఈ గలాటా బే ద్వీపం. ఇటీవల కాలంలో చైనా ఇండియన్ ఓషియన్ లో విపరీతంగా సబ్ మెరైన్లు, యుద్ధ వాహన నౌకలు తిరుగుతున్నాయి. భారత్ గనుక గ్రేటర్ నికోబర్ లో ఒక స్థావరం ఉంటే చాలా క్లోజ్ గా మానిటర్ చేయవచ్చు. ఒకటి రవాణా పరంగా ఇంకోటి రక్షణ పరంగా ఈ నికోబర్ దీవి భారత్ కు అత్యంత కీలకంగా మారనుంది.



